Corona Virus : జలుబు చేసిందా.. భయపడకండి అది కరోనా వైరస్ కాదట

కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు భారత్ లో పెరుగుతున్నాయి.

Update: 2025-06-04 05:37 GMT

కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు భారత్ లో పెరుగుతున్నాయి. ప్రస్తుతం విస్తరిస్తున్న వైరస్ ప్రమాదకరం కాదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ లో ఒకటని, దీనికి పెద్దగా భయాందోళనలు చెందాల్సిన పనిలేదని, వంద కేసుల్లో 96 మంది ఇంటి వద్దనే ఉండి చికిత్సతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది. అదే సమయంలో జలుబు వచ్చిన వెంటనే ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇప్పుడు వర్షాలు పడటం, నైరుతి రుతుపవనాల రాకతో ఎండ వేడిమి, భారీ ఉష్ణోగ్రతల నుంచి వాతావరణం మారడంతో సహజంగానే జలుబు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

యాక్టివ్ కేసులు...
జలుబు ఒక్కటే కాదని దగ్గుతో పాటు జ్వరం, ఒళ్లునొప్పులు,కళ్ల మంటలు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ లో నాలుగువేల యాక్టివ్ కేసులు దాటాయి. ప్రస్తుతం భారత్ లో 4,026 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,446 కేసులు నమోదయ్యాయని, మహారాష్ట్రలో 494, గుజరాత్ లో 397, ఢాల్లీలో 393 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఐదుగురు కరోనా వైరస్ తో మరణించారని చెప్పింది. ఇందులో మహరాష్ట్రలో ఇద్దరు, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఒక్కొరు చొప్పున మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో...
దేశంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ బారిన పడి ఈ ఏడాది 37 మంది వరకూ మరణించారని కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 26 కరోనా యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇది పెద్ద ప్రమాదకరమైన జబ్బు కాదని, మందులు వాడితే నయమవుతుందని చెబుతున్నారు. కానీ అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్ లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యాధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News