Sabarimala : శబరిమల బంగారం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్

శబరిమల బంగారం కేసులో పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు

Update: 2025-10-17 03:50 GMT

శబరిమల బంగారం చోరీ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఎస్‌ఐటీ అధికారులు ఆయనను విచారించిన అనంతరం నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. కేరళలోని శబరిమల ఆలయం నుంచి బంగారం మిస్సింగ్‌ ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ పొట్టి ని శుక్రవారం అరెస్ట్‌ చేసింది. హైకోర్టు ఈ దర్యాప్తు ఆరు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుంది.

నేడు కోర్టుకు...
పోలీస్‌ వర్గాల సమాచారం ప్రకారం, బెంగళూరులో వ్యాపారం చేస్తున్న పొట్టి, అక్కడి తన నివాసం నుంచి గురువారం అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనంతరం అతన్ని తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ కార్యాలయంలో విచారించారు. విచారణ పూర్తయ్యాక, శుక్రవారం అతడి అరెస్ట్‌ నమోదు చేసినట్లు చెప్పారు. వైద్యపరీక్ష కోసం పొట్టిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తర్వాత అతన్ని న్యాయస్థానానికి తరలించనున్నారు. ఈ కేసులో అతని నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు కస్టడీ కోరనున్నట్లు అధికారులు తెలిపారు.
రెండు కేసులపై...
కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన ఎస్‌ఐటీ రెండు కేసులపై దర్యాప్తు చేస్తోంది. వీటిలో ఒకటి ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారం మిస్సింగ్‌ కేసు కాగా, మరొకటి శ్రీకోవిల్‌ తలుపుల ఫ్రేమ్‌ల నుంచి బంగారం మాయమైన సంగతి తెలిసిందే. ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సభ్యులు, అధికారుల ప్రమేయం ఉన్న అవకాశంపై కూడా ఎస్‌ఐటీ దర్యాప్తు చేస్తోంది. 2019లో ద్వారపాలక విగ్రహాల బంగారు కప్పులూ, శ్రీకోవిల్‌ తలుపుల బంగారు ఫ్రేమ్‌లు ఎలక్ట్రోప్లేటింగ్‌ కోసం పొట్టికి అప్పగించిన వ్యవహారాన్ని పరిశీలిస్తోంది. ఇంతకుముందు టీడీబీ విజిలెన్స్‌ విభాగం కూడా పొట్టిని రెండు రోజులపాటు ప్రశ్నించి, అతడి వాంగ్మూలం రికార్డు చేసింది.


Tags:    

Similar News