Operation Sindoor : పకడ్బందీగా "ఆపరేషన్ సింధూర్" ఎలా మొదలయిందంటే?
ఆపరేషన్ సింథూర్ ఒక్క రోజులో జరగలేదు. కొన్ని రోజుల నుంచి భారత్ పకడ్బందీగా ప్లాన్ చేసింది
ఆపరేషన్ సింథూర్ ఒక్క రోజులో జరగలేదు. కొన్ని రోజుల నుంచి భారత్ పకడ్బందీగా ప్లాన్ చేసింది. పాకిస్థాన్ పై యుద్ధం కాకుండా ఉగ్రవాదులపైనే దాడి చేయాలన్న లక్ష్యంతోనే ఆచి తూచి వ్యవహరించారు. గత కొద్ది రోజుల నుంచి త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ తరచూ సమావేశమవుతున్నారు. పహాల్గాం దాడికి ప్రతీకార చర్య తీసుకోవాల్సిందేనని, అయితే ఈ చర్యల్లో పాక్ పౌరులు ఇబ్బంది పడకుండా ఉగ్రవాదులే మన లక్ష్యంగా ఉండాలని, అలా ప్లాన్ చేయాలని ప్రధాని ఆదేశించారు. కాస్త ఆలస్యమయినా ఉగ్రవాదులను ఉపేక్షించకుండా దాడులు చేయాలని కూడా ప్రధాని ఆదేశించినట్లు తెలిసింది. అందుకే ఏప్రిల్ 22వ తేదీన పహాల్గాం దాడి జరిగిన తర్వాత దాదాపు పదమూడు రోజులకు ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించారు.
ఇంటలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు...
ఈ ఆపరేషన్ సింధూర్ లో ప్రధానంగా ఇంటలిజెన్స్ ప్రధాన పాత్ర పోషించిందని అంటున్నారు. ఇంటలిజెన్స్ ఖచ్చితమైన సమాచారం ఇచ్చి పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించి అక్కడే ఎక్కువ మంది మకాం వేశారని, అక్కడే శిక్షణ శిబిరాలతో పాటు వారి ప్రధాన స్థావరాలు కావడంతో వాటిని లక్ష్యంగా చేసుకుంటే ఉగ్రవాదులపై దాడి జరిపినట్లు తెలిపింది. ఈ మేరకు భారత్ సైన్యం ఇంటలిజెన్స్ రిపోర్టు ను అనుసరించి భారత్ గడ్డపై నుంచి మిసైళ్లతో దాడులకు దిగింది. అయితే లక్ష్యం గురి తప్పలేదు. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్న దాడులు సక్సెస్ అయ్యాయి. ఇందుకోసం అర్థరాత్రిని ఎంచుకుంది. తొమ్మిది ప్రధాన ఉగ్రవాద స్థావరాలను మట్టి కరిపించింది.
నిమిషాల్లోనే ముగించి...
మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సింధూర్ మొదలయింది. మొత్తం ఆపరేషన్ నిమిషాల్లోనే ముగించేశారు. ఊహించని విధంగా భారత్ దాడులకు పాకిస్థాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదులు కూడా బిత్తరపోయారు. మెరుపుదాడులు నిర్వహించడంతో కొందరు తప్పించుకోలేకపోయారని భారత సైన్యం ప్రకటించింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించాయి. ఉగ్రవాదులు తేరుకునేలోగానే వారికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో పహాల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ గట్టి జవాబు ఇచ్చిందని చెప్పాలి. ఒక్కరోజులో కాకుండా పక్కా ప్లాన్ తోనే దాడులు నిర్వహించడంతో ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని అంటున్నారు. అయితే భారత్ చేసిన ఈ దాడులకు ప్రతీకారంగా పాక్ కవ్వింపు చర్యలకు దిగుతుందని పలు ముందస్తు చర్యలు కూడా తీసుకుంది.