Delhi : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే?
ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో నేడు తేలనుంది. నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది
ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో నేడు తేలనుంది. నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులను కూడా నిర్ణయించనున్నారు. ఈ కీలక భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ నెల 8వ తేదీన ఢిల్లీ ఎన్నిక కౌంటింగ్ పూర్తయి బీజేపీ భారీ విజయం సాధించినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంతవరకూ ప్రకటించలేదు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండటంతో అమిత్ షా, జేపీ నడ్డా నేతలతో మాట్లాడి మొత్తం పదిహేను మంది పేర్లతో జాబితాను సిద్ధం చేశారు.
నేడు తేల్చనున్న కమిటీ...
వీరిలో ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మంత్రి వర్గంలో ఎవరుంటారన్న దానిపై ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసిన అమిత్ షా, జేపీ నడ్డాలు పార్లమెంటరీ పార్టీ సమావేశం ముందు ఈ జాబితాను ఉంచనున్నారు. ఈసారి మహిళ ముఖ్యమంత్రిని నియమించే అవకాశముందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. రేపు రామ్ లీలా మైదానంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్ లీలా మైదానంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి.