GST Slabs : దసరా పండగకు ముందే గుడ్ న్యూస్.. ధరలు దిగి రానున్న వస్తువులివే
నేటి అర్థరాత్రి నుంచి జీఎస్టీ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు రేపు ఉదయం నుంచి తగ్గిన ధరలతో వస్తువులు అందుబాటులోకి రానున్నాయి
నేటి అర్థరాత్రి నుంచి జీఎస్టీ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు రేపు ఉదయం నుంచి తగ్గిన ధరలతో వస్తువులు అందుబాటులోకి రానున్నాయి. నెలవారీ ఖర్చులతో తడిసి మోపెడవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబ్ లలో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఊరట కలిగించనుంది. దీపావళికి దేశ ప్రజలకు భారీ బహుమతి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో అంతకు ముందుగానే దసరా పండగ రోజున తగ్గిన ధరలతో వస్తువులు చేతికి అందనున్నాయి.
జీఎస్టీ శ్లాబుల్లో మార్పులతో...
జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించడంతో వివిధ వస్తువులు తయారీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలు తగ్గించనున్నాయి. నెలవారీగా పేదల ఇళ్లలో వినియోగించుకునే అనేక వస్తువులు ఈ అర్థరాత్రి నుంచి దిగిరానున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి తగ్గించిన శ్లాబ్ లు అమలు కానుండటంతో రేపు ఉదయం నుంచి ధరలు తగ్గనున్నాయి. అనేక రకాల వస్తువులు చౌకగా లభించనున్నాయి. రేపటి నుంచి ఇక ఐదు, పద్దెనిమిది శాతం శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ వస్తువుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ వస్తువుల ధరలు...
తగ్గుతున్న వస్తువుల ధరల్లో ఎక్కువగా షాంపూలు, సబ్బులు, టూత్ పేస్ట్ లు, టూగ్ బ్రష్ లు, రేజర్లు, బేబీ డైపర్లు వంటివి కూడా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా కొంత మేర తగ్గనున్నాయి. దీంతో పాటు టీవీలు, కంప్యూటర్లు వంటివి కూడా ధరలు రేపు ఉదయం నుంచి తగ్గనున్నాయి. ఇప్పటికే ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన వివిధ తయారీ సంస్థలు రేపటి నుంచి తగ్గించిన ధరలతో అమ్ముడు కానున్నాయి. దసరా పండగకు ముందే జీఎస్టీ తగ్గింపు ధరలు అమలులోకి రానుండటంతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు మరింత హ్యాపీగా పండగ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లయిది.