Ponnuswamy Radhakrishnan : ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పొన్నుస్వామి రాధాకృష్ణన్
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేశారు. అభ్యర్థి ఎంపికలో ఆర్ఎస్ఎస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. భార
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేశారు. అభ్యర్థి ఎంపికలో ఆర్ఎస్ఎస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. భారత ఉపరాష్ట్రపతిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పొన్నుస్వామి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేశారు. ఈ ఎంపిక వెనక ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. గతంలో జార్ఖండ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన నేత. గతంలో రెండు దఫాలు కోయంబత్తూరు నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.
దక్షిణాదికి ప్రాధాన్యత ఇవ్వాలని...
మరొకవైపు దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో రాధాకృష్ణన్ ఎంపిక జరిగిందని అంటున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాధాకృష్ణన్ ఎంపిక అక్కడ పార్టీ ఎదుగుదలకు మరింత దోహదపడుతుందని అంచనాలు వినిపించాయి. తొలుత అనేక పేర్లు వినిపించినా చివరకు రాధాకృష్ణన్ ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయన పేరును ఖరారు చేసింది. ఉభయ సభల్లో ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో రాధాకృష్ణన్ ఎన్నిక నల్లేరు మీద నడకే అవుతుందని అంటున్నారు.
సీనియర్ నేతగా...
దీంతో పాటు రాధాకృష్ణన్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. అందులోనూ ఆయనకు ఆర్ఎస్ఎస్ మద్దతు పుష్కలంగా ఉందని అంటున్నారు. దక్షిణాదిపై ఉత్తరాది నాయకత్వం చిన్నచూపు చూస్తుందన్న అపప్రధను పారద్రోలేందుకు ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎంపిక మరింత మేలు చేస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరొకవైపు వెంకయ్యనాయుడు దక్షిణాది నేతగా ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత మరోసారి ఈ ప్రాంతానికి ఆ పదవి లభించకపోవడం కూడా రాధాకృష్ణన్ ఎంపిక కారణమని తెలిసింది. దీంతో భారత 17వ ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఎంపికతో బీజేపీ ప్రాంతీయ సమతుల్యతను అనుసరించినట్లవుతుందని అంటున్నారు. రాధాకృష్ణన్ ఈ నెల ఇరవై ఒకటో తేదీన నామినేషన్ వేసే అవకాశముంది.