మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. ప్రధాని మోదీకే పట్టం

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది కంటే తక్కువ సమయం ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి ఆదరణ

Update: 2023-08-25 06:34 GMT

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది కంటే తక్కువ సమయం ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి ఆదరణ తగ్గలేదని ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని అభిప్రాయపడ్డారు. మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంఓటీఎన్) ఆగస్టు ఎడిషన్ సర్వేలో 63 శాతం మంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం సర్వేతో పోల్చితే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అంతకు ముందు 72 శాతం మంది ప్రధాని మోదీ పనితీరుతో సంతృప్తి చెందామని చెప్పారు. 2024 ఎన్నికల్లో మోదీని చూసే బీజేపీకి ఓటు వేస్తామని 44 శాతం మంది అభిప్రాయపడినట్లు మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది. బీజేపీకి ఓటు వేయడానికి గల కారణాలు- అభివృద్ధి, హిందుత్వ కారణాలేనని తేల్చి చెప్పింది ఇండియా టుడే-సీఓటర్ సర్వే. 13 శాతం మంది మోదీ పనితీరుకు యావరేజ్ మార్కులు వేశారు. మరో 22 శాతం మంది ఆయన పనితీరు పేలవంగా ఉందని తేల్చేశారు.

ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 306 స్థానాలు సొంతం చేసుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 272 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఈ మ్యాజిక్ మార్క్ ను ఎన్డీయే సులభంగానే అధిగమిస్తుందని వెల్లడైంది. ఇక ఇటీవలే ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్ష కూటమికి 193 సీట్లు వరకు లభిస్తాయని ఈ సర్వే తెలిపింది. ఇతర పార్టీలకు 44 స్థానాలు వస్తాయని పేర్కొంది. కాకపోతే 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన 352 స్థానాలతో పోలిస్తే ప్రస్తుతం 46 స్థానాలు తగ్గుతున్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News