ఉపరాష్ట్రపతి ఎన్నిక.. కాంగ్రెసేతర అభ్యర్థి కోసం ఇండియా కూటమి కసరత్తు.?
దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబర్ 9న ఓటింగ్ జరగనుండగా.. ఇందుకోసం అధికార పక్షం, విపక్షాలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబర్ 9న ఓటింగ్ జరగనుండగా.. ఇందుకోసం అధికార పక్షం, విపక్షాలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. కాగా, త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెసేతర అభ్యర్థిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యమని భావిస్తున్నారు. తద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లను తమవైపు మళ్లించుకోవచ్చనేది ప్లాన్.
గురువారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంట్లో విందు ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూఖ్ అబ్దుల్లా, ప్రతిపక్ష నేతల సమావేశం కూడా జరిగింది. టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ సహా 14 మంది సీనియర్ ప్రతిపక్ష నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చ జరిగినట్లు సమాచారం.
అయితే.. విపక్షాల అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ అల్వా నామినేషన్‌ను ప్రస్తావించగా.. గురువారం నాటి సమావేశానికి హాజరైన ఓ సీనియర్ ప్రతిపక్ష నేత మాట్లాడుతూ.. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జరిగిన పొరపాటును పునరావృతం చేయలేం అన్నారు. పార్లమెంటులో రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్.. కాంగ్రెస్ అభ్యర్థి అల్వాకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించిందని వ్యాఖ్యానించారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం అభ్యర్థిని నిలబెట్టేందుకు టీఎంసీ విముఖత వ్యక్తం చేసిందని మరో నేత పేర్కొన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాత్రం మీడియాతో మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఇండియా కూటమి సమిష్టి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
రాహుల్ గాంధీ నివాసంలో గురువారం జరిగిన సమావేశంలో ఇండియా కూటమి ఐక్యంగా ఎన్నికల్లో పోరాడాలని నేతలంతా అంగీకరించినట్లు సమాచారం. అయితే.. ఈ సమయంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఓడించడానికి ఎన్డీయే వద్ద తగినంతమంది ఎంపీలు ఉన్నారని వాదించారు. అయితే ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో సంఖ్యా బలంతో కాకుండా సైద్ధాంతిక ప్రాతిపదికన పోరాడవలసి ఉంటుంది.