Weather Report : మరో మూడు నెలలు చలితీవ్రత మామూలుగా ఉండదట
ఈ ఏడాది మూడు నెలల పాటు దేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది
ఈ ఏడాది మూడు నెలల పాటు దేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రాబోయే మూడు నెలల శీతాకాలం మధ్య భారతంతో పాటు వాయువ్య భారతం, ద్వీపకల్పానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సాధారణం నుంచి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. గతంలో కంటే ఈసారి కొన్ని రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత అదనపు రోజులు ఉంటాయని వెల్లడించింది.
ఈశాన్య భారతంలో...
హిమాలయ పశ్చిమ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు–పడమర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించి ఉండొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు రోజులు ఎక్కువగా చలిగాలుల పరిస్థితులు కనిపించవచ్చని చెప్పారు. ఈ ప్రాంతాలు సాధారణంగా డిసెంబర్–ఫిబ్రవరిలో 4 నుంచి 6 రోజులు మాత్రమే చలిగాలులను ఎదుర్కొంటాయని వివరించారు. దేశంలో ఎక్కువ భాగాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతంలోనూ ఈ సీజన్‌లో సాధారణం నుంచి తక్కువ స్థాయిలో ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
రేపటి నుంచి తీవ్రత పెరిగే...
నవంబర్ 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పశ్చిమ, మధ్య, తూర్పు భారతంలోని ఒంటరి ప్రాంతాల్లో తొలి చలి–తీవ్రమైన చలి తీవ్రత నమోదైందని, ఈ ప్రభావం ప్రధానంగా ఈశాన్య రాజస్థాన్, దక్షిణ హర్యానా, ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ యూపీ, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మరియు నవంబర్ 15–20 మధ్య ఉత్తర అంతర్గత మహారాష్ట్రలో కనిపించిందని వివరించింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వాయువ్య, మధ్య భారతంలో మరో చలి గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. నవంబర్‌లో దేశంలోని అధికభాగం ప్రాంతాలు సాధారణం నుంచి తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, చలితీవ్రత నుంచి కాపాడుకోవాలని సూచించింది.