Haryana : హర్యానాలో ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి మృతి... బాధ్యులెవరు?

హర్యానా కేడర్‌ ఐపీఎస్‌ అధికారి వై.పురాన్‌కుమార్‌ మంగళవారం చండీగఢ్‌లోని సెక్టర్‌–11లోని తన నివాసంలో మృతిచెందారు.

Update: 2025-10-08 03:16 GMT

హర్యానా కేడర్‌ ఐపీఎస్‌ అధికారి వై.పురాన్‌కుమార్‌ మంగళవారం చండీగఢ్‌లోని సెక్టర్‌–11లోని తన నివాసంలో మృతిచెందారు. తుపాకీతో కాల్చుకుని ఆయన బలవన్మరణం పొందారు. ఆయన వివిధ పరిపాలన, హక్కులు, సీనియారిటీ అంశాలపై చురుకుగా స్పందించే అధికారి గా గుర్తింపు పొందారు. వ్యవస్థ పారదర్శకతపై కట్టుబాటు చూపిన అధికారి గానూ ప్రసిద్ధి చెందారు. 2001 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంజనీరింగ్‌ చదివిన తర్వాత ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. ఆయన అంబాలా, కురుక్షేత్ర జిల్లాల్లో పనిచేశారు. అంబాలా, రోహ్ తక్‌ ప్రాంతాల్లో ఐజీగా, అలాగే హోమ్‌గార్డ్స్‌, టెలికమ్యూనికేషన్స్‌ విభాగాలకు అధిపతిగా వ్యవహరించారు. ఆయన పదవీ విరమణ 2033లో చేయాల్సి ఉంది. షెడ్యూల్డ్‌ కులాల ప్రాతినిధ్యం అంశంలో గళమెత్తిన అధికారి ఆయన.

అనేక అంశాల్లో వివాదాలు...
ఇటీవలి కాలంలో హర్యానా ప్రభుత్వంతో అనేక పరిపాలనా వివాదాల్లో ఆయన పేరు వినిపించింది. గత ఏడాది టెలికమ్యూనికేషన్స్‌ ఐజీగా ఉన్నప్పుడు తన అధికారిక వాహనాన్ని తిరిగి ఇచ్చి, తన అర్హత మేరకు వాహనం ఇవ్వాలని కోరారు. వాహనాల కేటాయింపులో వివక్ష ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సంవత్సరం, 1991, 1996, 1997, 2005 బ్యాచ్‌ల అధికారుల ప్రమోషన్లు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సీఎం నాయబ్‌సింగ్‌ సైనీకి లేఖ రాసి, యూనియన్‌ హోమ్‌ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అతిక్రమించారని తెలిపారు. తన బ్యాచ్‌ కు చెందిన అధికారులను డీఐజీ స్థాయికి పరిగణించాలని, వేతనాలను సరిచేసి బకాయిలు ఇవ్వాలని కోరారు.
వివక్ష చూపుతున్నారని...
తన ఫిర్యాదులు పట్టించుకోకపోవడానికి తాను ఎస్సీ వర్గానికి చెందినవాడినే కారణమని పురన్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎస్సీ అధికారులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి చేత అవమానం, వేధింపులపై ఆయన రెండు నెలల్లో ఐదు ఫిర్యాదులు చేశారు. తనపై విచారణ కమిటీ నియామకాన్ని కూడా వ్యతిరేకించారు.2023 మార్చిలో హోమ్‌గార్డ్స్‌ ఐజీగా నియమితులయ్యారు. కానీ ఆ హోదా కేడర్‌లో లేదని గుర్తుచేస్తూ అప్పటి చీఫ్‌ సెక్రటరీకి లేఖ రాశారు. తాను ప్రజా దృష్టిలో అవమానానికి గురయ్యేలా ఈ పోస్టు ఇచ్చారని ఆరోపించారు. 2022లో సిర్సా పోలీస్‌ లైన్స్‌లో అనుమతి లేకుండా ఆలయం నిర్మాణంపై చర్యలు తీసుకున్నారు. పరిపాలనా నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తెచ్చిన ఆయన ఆ ఘటనపై విచారణకు దారి తీశారు. పురన్‌కుమార్‌ భార్య అమ్నీత్‌ప్‌ కుమార్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం హర్యానా సీఎం నాయబ్‌సింగ్‌ సైనీతో జపాన్‌లో అధికార బృందంలో ఉన్నారు.
Tags:    

Similar News