Haryana : హర్యానా డీజీపీ సెలవులో.. పూరన్ కుమార్ బలవన్మరణం కేసు

హర్యానా ఐపీఎస్‌ అధికారి పూరన్ కుమార్‌ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Update: 2025-10-14 04:59 GMT

హర్యానా ఐపీఎస్‌ అధికారి పూరన్ కుమార్‌ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఇంకా వివాదం కొనసాగుతుంది. ఐపీఎస్‌ అధికారి వై. పూరన్ కుమార్‌ ఆత్మహత్య ఘటనపై రాజకీయంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ శత్రుజిత్ కపూర్‌ను సెలవుపై పంపింది. ఇటీవల రోహ్‌తక్‌ ఎస్పీగా పనిచేసిన నరేంద్ర బిజర్నియాను కూడా బదిలీ చేసిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.

వివక్ష చూపారంటూ...
ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రాజీవ్‌ జైట్లీ మాట్లాడుతూ “అవును, డీజీపీని ప్రభుత్వ ఆదేశాలతో సెలవుపై పంపారు” అని తెలిపారు. పూరన్ కుమార్‌ తన చివరి గమనికగా వదిలిన ఎనిమిది పేజీల నోటులో కపూర్‌, బిజర్నియాతో పాటు ఎనిమిది మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై జాతి ఆధారంగా వివక్ష చూపడం, మానసిక వేధింపులు, అవమానాలు చేశారని ఆరోపించారు. ఆ అధికారి భార్య, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అమ్నిత్‌ పి. కుమార్‌ ఇద్దరు అధికారుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని, తమ భర్త ఆత్మహత్యకు కారణమైందని ఆరోపించారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం...
ఈ ఇద్దరి అరెస్టు వరకు మృతదేహానికి పోస్టుమార్టం, అంత్యక్రియలు చేయబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. 2001 బ్యాచ్‌ కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన పూరన్ కుమార్‌ అక్టోబర్‌ 7వ తేదీన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన వెంటనే చండీగఢ్‌ పోలీసులు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పలువురు రాజకీయ నాయకులు పూరన్ కుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నేడు కుటుంబాన్ని కలవనున్నారు. అలాగే మరొక వైపు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏర్పడిన 31 మంది సభ్యుల కమిటీ 48 గంటల గడువు ఇచ్చింది.


Tags:    

Similar News