Delhi : తాడో పేడో తేల్చుకుంటామంటున్న రైతులు.. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత

రైతులు నేడు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి

Update: 2024-02-21 03:09 GMT

రైతులు నేడు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ గత కొద్ది రోజులుగా శంభు సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో నాలుగు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేడు చలో ఢిల్లీకి రైతులు పిలుపు నిచ్చారు. రైతులు ఢిల్లీలోకి చొరబడకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలు మొహరించాయి. ఎక్కడికక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో బ్యారికేడ్లను, సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేసి పహారా కాస్తున్నాయి.

డెడ్ లైన్ పెట్టి మరీ...
మరోవైపు ఉత్తర్‌‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్న రైతులు ప్రస్తుతం శంభు సరిహద్దుల్లో ఉన్నారు. వారంతా ట్రాక్టర్లు, కాలినడకన బయలుదేరారు. ఈరోజు ఉదయం 11 గంటలలోపు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర డిమాండ్‌పై స్పందించాలని రైతులు అల్టిమేటం ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పదన రాలేదు. దీంతో రైతులు ఏ క్షణమైనా ఢిల్లీ వైపునకు దూసుకు వచ్చే అవకాశముందని అంచనా వేసిన ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించింది.
కేంద్ర ప్రభుత్వం...
హర్యానాలో ఇప్పటికే ఇంటర్నెట్ సేవలు, బల్క్ ఎస్‌ఎంఎస్ లపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే రైతులు మాత్రం తగ్గడం లేదు. ఏం జరిగినా అందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ రైతు సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. పార్లమెంటు సమావేశాన్ని ఒకరోజు అయినా ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పిస్తూ తీర్మానం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం మాత్రం సీరియస్ గానే తీసుకున్నట్లుంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. మరోవైపు రైతుల ఆందోళనతో ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి.


Tags:    

Similar News