ఢిల్లీలో రాళ్ల దాడితో ఉద్రిక్తత

ఢిల్లీ రామ్ లీలా మైదాన్ పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు ఉద్రిక్తంగా మారాయి

Update: 2026-01-07 03:57 GMT

ఢిల్లీ రామ్ లీలా మైదాన్ పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనలో కనీసం ఐదుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. టర్క్‌మన్ గేట్ ప్రాంతంలో ఉన్న సయ్యద్ ఫైజ్ ఎలాహి మసీదు, సమీప ఖబరస్తాన్ పక్కన ఉన్న భూమిపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. ఈ సమయంలో కొందరు రాళ్లు విసిరినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భాష్పవాయువును ప్రయోగించి...
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని పోలీసులు చెప్పారు. ముందస్తుగా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, పలు ప్రాంతాల్లో సీనియర్ అధికారులు మోహరించినట్లు పోలీసులు వెల్లడించారు.స్థానిక శాంతి కమిటీల సభ్యులతో ముందే సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని పోలీసులు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.


Tags:    

Similar News