Delhi : ఢిల్లీ లో హై అలెర్ట్.. హస్తిన వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాల్సిందే
ఢిల్లీ గాలికాలుష్యం అత్యంత దారుణంగా ఉంది. ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా దెబ్బతినింది.
ఢిల్లీ గాలికాలుష్యం అత్యంత దారుణంగా ఉంది. ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా దెబ్బతినింది. జాతీయ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలోఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 349గా నమోదైంది. ఢిల్లీలోని 39 గాలి నాణ్యత మానిటరింగ్ కేంద్రాల్లో 27 కేంద్రాల్లో ‘అత్యంత దారుణం’ స్థాయి నమోదైంది. ఆరు కేంద్రాల్లో ‘తీవ్ర’ స్థాయికి చేరింది. జహాంగీర్‌పురి ప్రాంతంలో 432గా అత్యధిక ఏక్యూఐ నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ‘సమీర్’ యాప్ వెల్లడించింది. నిపుణుల అంచనా ప్రకారం, వారాంతంలో పరిస్థితి మరింత క్షీణించి ప్రమాదకర స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.
ప్రధానంగా రవాణా రంగమే...
ఢిల్లీ గాలికాలుష్యానికి ప్రధాన కారణంగా రవాణా రంగమేనని తేల్చారు. మొత్తం కాలుష్యంలో రవాణా వాటా 16.5 శాతంగా ఉంది. వాహనాల కాలుష్యం వల్లనే గాలి నాణ్యత తగ్గుతుందన్న నివేదికలు వెల్లడిస్తున్నాయి. నగరం, పరిసర పరిశ్రమల వల్ల 8.6 శాతం, గృహ వనరుల వల్ల 4.1 శాతం, నిర్మాణ కార్యకలాపాల వల్ల 2.2 శాతం, చెత్త దహనం వల్ల 1.4 శాతం కాలుష్యం ఏర్పడుతున్నట్లు అంచనా వేసింది. ఢిల్లీ వాసులతో పాటు పర్యాటకులు కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వస్తే ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని వైద్యులు కోరుతున్నారు.
పలువురికి అస్వస్తత...
ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో పలువరు అస్వస్థతకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ పదిహేనుమంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఐఐటీ మద్రాస్‌కు చెందిన అశోక్ ఝుంజున్ వాలా నేతృత్వంలోని ఈ కమిటీలో మాజీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సహాధ్యక్షుడిగా ఉన్నారు. వాహన ఉద్గారాల తగ్గింపుకు బహుముఖ కార్యాచరణ ప్రణాళికను కమిటీ రూపొందించనుంది. మొత్తం మీద ఢిల్లీ వెళ్లే వారు అలెర్ట్ గానే ఉండాలని సూచించింది.