Delhi : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. దీపావళి తర్వాత ఎంతో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. దీపావళి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి దేశ రాజధానిలో బాణాసంచా పేల్చడంతో ఢిల్లీ గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతినింది. నగరంలోని ఎక్కువశాతం గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ‘రెడ్ జోన్’లోకి చేరినట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు గ్రీన్ కాకర్స్ రాత్రి 8 నుంచి పది గంటల వరకు మాత్రమే ఉపయోగించవచ్చని అనుమతించినప్పటికీ, నగరంలో వేడుకలు అర్థరాత్రి వరకూ కొనసాగాయి. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరింత పెరిగిందని అంటున్నారు.
అనారోగ్యం పాలవుతూ...
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంచనా ప్రకారం రాత్రి 10 గంటలకు ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ 344గా నమోదైంది. ఇందులో నాలుగు ప్రాంతాలు 400 మార్క్‌ను దాటాయి. ద్వారక లో 417, అశోక్ విహార్ 404, వజీర్‌పూర్ 423, ఆనంద్ విహార్ 404లో తీవ్ర స్థాయిలో కాలుష్యం నమోదైందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో గ్రాప్–2 చర్యలు అమల్లో ఉన్నాయి. వాయు కాలుష్యం పెరగడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. శరీరంపై దుద్దుర్లు, కళ్ల మంటలు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
మరింత పెరుగుతుందని...
ఢిల్లీ నగరంలోని 38 కేంద్రాల్లో 36 ప్రాంతాలు ‘రెడ్ జోన్’లో ఉన్నాయని అధికారులు తెలిపారు. కారులు గాలి నాణ్యత మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్నింగ్ వాకర్స్ తో పాటు ద్విచక్ర వాహనాలు, కాలినడకన బయటకు వచ్చే వారు ఖచ్చితంగా మాస్క్ లను ధరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీపావళి పండగ తర్వాత వాయు కాలుష్యం మరింత పెరుగుతుందని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం ఇందుకు గ్రాప్ - 2 చర్యలను చేపట్టింది. హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ లలో వ్యర్థాల దహనం కారణంగా కూడా ఈ వాయుకాలుష్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు.