Tamilnadu : తమిళనాడులో మొంథా తుఫాను ఎఫెక్ట్.. దూర ప్రయాణాలను రద్దు చేసుకోండి
తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో ఈరోజు భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ మెచ్చరికలు జారీ చేసింది
తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో ఈరోజు భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ మెచ్చరికలు జారీ చేసింది.మొంథా తుఫాను కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉండటంతో ఈ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశలో కాకినాడ తీరాన్ని ఈ నెల 28వ తేదీ రాత్రి దాటవచ్చని అంచనా వేసిన అధికారులు తమిళనాడులోనూ అప్రమత్తం చేశారు. చెన్నైతో పాటు రాణిపేట, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అతి భారీ వర్షాలు
విల్లుపురం, చెంగళపట్టు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వారు చెప్పారు. బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మొంథా తుపాను చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశలో సుమారు 600 కి.మీ దూరంలో కేంద్రీకృతం అవుతుందని చెప్పారు. పుదుచ్చేరి ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మొంథా తుఫాను వచ్చే 12 గంటల్లో దక్షిణ పశ్చిమ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతుందన్నారు.
అంతా సిద్ధంగా...
ఆ తర్వాత వాయువ్యానికి, ఉత్తర వాయువ్యానికీ కదులుతూ అక్టోబర్ 28వ తేదీ ఉదయానికి తీవ్రమైన వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ తీరంలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య — కాకినాడ పరిసర ప్రాంతంలో అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే తీవ్రమైన చక్రవాతంగా దాటే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్‌లో పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే మంచిదని చెప్పింది. దూర ప్రయాణాలను కూడా వీలయితే రద్దు చేసుకోవాలని కోరింది.