Corona Virus : భారత్ లో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. మరణాలు

భారత్ లో కరోనా వైరైస్ వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్నాయి

Update: 2025-06-07 06:07 GMT

భారత్ లో కరోనా వైరైస్ వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య భారత్ లో ఎక్కువగా కనిపిస్తుంది. వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందుగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. హాంకాంగ్, స్విట్జర్ లాండ్ లలో కేసులు నమోదయినప్పుడే భారత ప్రజలను కూడా అప్రమత్తం చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలతో పాటు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలను చేపట్టాలని కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.

మరణాల సంఖ్యతో...
దీంతో అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ కు సంబంధించిన ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసుకున్నారు. రోజు వారీ కోవిడ్ పరీక్షల సంఖ్యను కూడా పెంచారు. గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో కొత్తగా 391 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి భారత్ లో మొత్తం 5,755 కరోనా వైరస్ యాక్టివ్ కేసులున్నాయని అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో నాలుగు మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 59 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ...
దేశంలో అత్యధికంగా కేరళలోనే ఇప్పటికీ ఎక్కువగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కేరళలో ప్రస్తుతం 1,806 పాజిటివ్ కేసులున్నాయి. గుజరాత్ లో 717, ఢిల్లీలో 665, పశ్చిమ బెంగాల్ లో 622, మహారాష్ట్రలో 577, కర్ణాటకలో 444 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతంది. ఏపీలో ప్రస్తుతం 72 కేసులు నమోదు కాగా, తెలంగాణలో తొమ్మిది యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తెలిపారు. గడచిన ఇరవై నాలుగు గంటల్లో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ కారణంతో మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


Tags:    

Similar News