Central Government : మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ వస్తువులు ధరలు తగ్గుతాయా?
కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశంలోని మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది
కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశంలోని మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతుందో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట లభించనుంది. ఢిల్లీలోని అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపన్నుల విషయంలో కొంత వెసులుబాటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా మధ్య తరగతి, పేద ప్రజలపై జీఎస్టీ భారం పడుతుంది. దీనిపై ప్రజలు కొంత అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది.
కొనుగోళ్లు పెరిగి...
ధరలు అందుబాటులోకి వచ్చి తగ్గితే కొనుగోళ్లు పెరుగుతాయని, తద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని అంచనాలు వినపడుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో నిత్యావసరాల వస్తువుల ధరలతో పాటు మిగిలిన ధరలు కూడా పెరిగాయన్న ఆరోపణలను విపక్షాలు పదే పదే చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం పెరగటానికి తోడ్పడినప్పటికీ ప్రజలు మాత్రం అధిక ధరలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. అయితే ప్రస్తుతం మధ్యతరగతి భారతీయులకు అనుగుణంగా పన్ను రేట్లలో తగ్గింపును అందించబోతున్నట్లు చెబుతున్నారు. వివిధ వస్తువుల ధరలను అధిక జీఎస్టీ బ్రాకెట్ నుంచి తక్కువ పన్నులకు మార్చాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అంటున్నారు.
ధరలు తగ్గితే....
అదే జరిగితే అనేక వస్తువుల ధరలు భారీగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు. 12 శాతం కింద ఉన్న అనేక వస్తువులపై పన్నును 5 శాతానికి తగ్గించనున్నట్లు కేంద్రానికి చెందిన అధికారిక వర్గాలు తెలిపాయి. జీఎస్టీ పన్నులు తగ్గిస్తే తగ్గనున్న వస్తువులు టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంట సామాగ్రి, ఎలక్ట్రిక్ గీజర్లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు, చిన్న వాషింగ్ మెషిన్లు, సైకిళ్లు, రెడీమేడ్ దుస్తులు, ఫుట్ వేర్, స్టేషనరీ వస్తువులు,వ్యాక్సిన్స్, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాల ధరలు తగ్గే అవకాశముంది. జీఎస్టీ రేట్లను తగ్గించటం ద్వారా అమ్మకాలు పెరుగుతాయని ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు పెరిగి దీర్ఘకాలంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. రేపటి బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయం ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు.