రెండోకాన్పులో ఆడపిల్ల పుడితే రూ.6 వేలు
ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో పథకానికి రూపకల్పన చేసింది.
mission shakti scheme
ఆడపిల్లలను భారంగా భావించి పురిటిలోనే గొంతునొక్కేస్తున్న తల్లిదండ్రులెందరో. పుట్టగానే కనీసం కళ్లుతెరిచి లోకాన్నైనా చూడకుండానే.. ఆడపిల్ల పుట్టిందని వదిలించుకుంటున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో పథకానికి రూపకల్పన చేసింది. మిషన్ శక్తిపేరుతో అమలు చేయనున్న ఈ పథకంలో భాగంగా రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే.. తల్లుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేయనుంది. ఆడపిల్లల సంఖ్య పంచడం, తల్లిదండ్రులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రెండో కాన్పులో కవలలు పుట్టినా.. అందులో ఆడపిల్ల ఉంటే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. కాగా.. తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల కోసం ఇప్పటికే కేంద్రం "ప్రధానమంత్రి మాతృ వందన యోజన" పథకాన్ని అమలు చేస్తోంది. తొలి కాన్పులో ఏ బిడ్డ పుట్టినా.. మూడు దశల్లో తల్లులకు రూ.5 వేలు అందజేస్తోంది. గర్భం దాల్చినట్లు నమోదు చేసుకున్నాక రూ.1000, 6 నెలల తర్వాత రూ.2 వేలు, ప్రసవించాక ఇమ్యునైజేషన్ సైకిల్ పూర్తయ్యాక రూ.2 వేలు చొప్పున నగదు అందజేస్తోంది. అయితే ఈ పథకం రెండో కాన్పునకు వర్తించదు.