Byjus: బైజూస్‌ కార్యాలయాలు మూసివేత.. కారణం ఏంటో తెలుసా?

ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్‌ ఇప్పుడు ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ..

Update: 2024-03-12 06:09 GMT

Byjus

ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్‌ ఇప్పుడు ఆర్థిక ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కష్టాల్లో చిక్కుకున్న బైజూస్‌ కంపెనీ ఉద్యోగుల జీతాలు సైతం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఖర్చు తగ్గింపులో భాగంగా బెంగళూరులోని ప్రధాన కార్యాలయం తప్ప దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విషయాలు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లుగా జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

బెంగళూరు నాలెడ్జ్ పార్కు‌లోని ఐబీసీ వద్ద ఉన్న ప్రధాన కార్యాలయం ఒకటి మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేసినట్లు కథనాల ద్వారా సమాచారం. అయితే దేశ వ్యాప్తంగా ఆఫీసులన్ని మూసివేత ప్రక్రియ గత కొన్ని నెలలుగా కొనసాగుతోందని తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో బైజూస్ ఆఫీసుల లీజు గడువులు ముగిసిన వెంటనే ఎక్కడికక్కడ ఆఫీసులు మూసివేస్తున్నట్లు కథనాల ద్వారా తెలుస్తోంది.

14 వేల మంది ఉద్యోగులు

కాగా, దేశవ్యాప్తంగా బైజూస్‌ సంస్థలో సుమారు 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరినీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 1000 మంది సిబ్బంది సహా దేశవ్యాప్తంగా ఉన్న 300 ట్యూషన్‌ కేంద్రాల సిబ్బందికి మాత్రం వర్క్‌ ఫ్రం హోమ్‌ వర్తించదు. ట్యూషన్‌ కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని సంబంధిత వర్గాలు చెప్పినట్లుగా సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ కేంద్రాలకు వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉండటంతో వాటిని యథాతథంగా కొనసాగించాలని కంపెనీ నిర్ణయించినట్లు నివేదికలు వెల్లడించాయి.

Tags:    

Similar News