Bengaluru : బితుకుబితుకు మంటూ బెంగళూరు వాసులు..రోజు గడిచేదెట్లా?

బెంగళూరు గత వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంది. ఎంతగా అంటే నగరంలో ఉండాలన్నా భయపడేటంత

Update: 2025-02-24 06:16 GMT

బెంగళూరు గత వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంది. ఎంతగా అంటే నగరంలో ఉండాలన్నా భయపడేటంత. గుక్కెడు నీటి కోసం పరితపించి పోయిన పరిస్థితి. గత ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెల చివర వారం వరకూ ఇదే పరిస్థితి ఏర్పడింది. చివరకు తిన్న గిన్నెలు కడుక్కోవాలన్నా నీరు లేని పరిస్థితి. హోటల్స్ లో కూడా నీటితో తయారు చేసే పదార్ధాలను నిలిపివేశారు. అంటే సాంబారు, రసం వంటి వాటిని కొన్ని నెలల పాటు దూరంగా ఉండాలని ఆదేశించారు. అదే సమయంలో హోటల్ కు వెళ్లినా ఎవరి నీరు వారు తెచ్చుకోవాలి. ఇడ్లీ సాంబారు కూడా దొరకని పరిస్థితి వచ్చిందంటే ఇక సీన్ ను ప్రత్యేకంగా వివరించాల్సిన పరిస్థితి లేదనుకోవచ్చు.

భూగర్భజలాలు అడుగింటి...
భూగర్భ జలాలు అడుగింటిపోయాయి. కావేరీ జలాలు ఇంకిపోయాయి. దీంతో ఎన్నడూ లేని నీటి ఎద్దడిని బెంగళూరు వాసులు చూశారు. నగరం విస్తరించడంతో పాటు బోర్లు ఇష్టానుసారం వేయడంతో పాటు చెట్లను నరికి వేసి కాంక్రీట్ జంగిల్ గా మార్చడంతో నగరం నీటి ఎద్దడికి గురయిందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. సౌకర్యాల పేరిట ఒకప్పుడు చల్లటి గాలులతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే బెంగళూరు నగరం గత రెండు దశాబ్దాలుగా పూర్తిగా మారిపోయింది. ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తింది. ఐటీ కంపెనీలను కొన్నింటిని మైసూరుకు తరలించాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
మే నెలలో ఎలా ఉంటుందో?
ప్రస్తుతం ఫిబ్రవరి నెలలోనే నీటి ఎద్దడి ఇంత తీవ్రంగా ఉంటే మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటుందన్నది కూడా ఊహకు అందకుండా ఉంది. డబ్బును వెచ్చించి కొనుగోలు చేయాలన్నా నీరు దొరకని పరిస్థితి. నీటి ట్యాంకర్లు వస్తే యుద్ధరంగాన్ని తలపిస్తుంది. గత ఏడాది అనేక మంది టెకీలు బెంగళూరు నగరాన్ని వదిలేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు సమీప ప్రాంతాల్లో బంధువుల ఇళ్లకు వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి ఈ పరిస్థితి తలెత్తింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే చర్యలు ప్రారంభించినా బెంగళూరు వాసులు క్యాలెండర్ లో డేట్ మారుతున్న ప్రతి రోజూ బితుబితుకుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉందంటే నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


Tags:    

Similar News