Bangladesh : ఏడాదిన్నర తర్వాత బంగ్లాదేశ్ లో ఎన్నికలు.. ఈసారి గెలుపు కోసం?
ఏడాదిన్నర తర్వాత నేడు బంగ్లాదేశ్ లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి.
బంగ్లాదేశ్ లో నేడు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతో బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఏడాదిన్నర క్రితం షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దేశం అస్థిరతను ఎదుర్కొంటుంది. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల తర్వాత ప్రధాని షేక్ హసీనా 15 ఏళ్ల పాలన కూలిపోయింది. అనంతరం బాధ్యతలు చేపట్టిన తాత్కాలిక ప్రభుత్వం అధీనంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల తర్వాత బంగ్లాదేశ్‌లో గురువారం కీలక పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం దేశ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 10 లక్షల భద్రతా సిబ్బందిని మొహరించింది. 13వ పార్లమెంట్ ఎన్నికలతో పాటు 84 అంశాల సంస్కరణల ప్యాకేజీపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరుగుతోంది.
అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు...
ఈసారి ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) మరియు ఒకప్పుడు దాని మిత్రపక్షంగా ఉన్న జమాత్-ఇ-ఇస్లామీ మధ్య జరుగుతోంది. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను గత ఏడాది ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. ఆ పార్టీకి ఎన్నికల్లో పోటీ నిషేధించింది.దేశవ్యాప్తంగా 299 నియోజకవర్గాల్లో ఉదయం 7.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఒక అభ్యర్థి మరణంతో ఒక నియోజకవర్గంలో పోలింగ్ రద్దు చేశారు. 50 రాజకీయ పార్టీలకు చెందిన 1,755 మంది అభ్యర్థులు, 273 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. బీఎన్‌పీ అత్యధికంగా 291 మందిని నిలబెట్టింది. మొత్తం 83 మంది మహిళలు పోటీలో ఉన్నారు.
శాంతి, సహనం పాటించాలన్న యూనస్
“ప్రతి ఓటరు తన ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించాలి” అని ప్రధాన సలహాదారు యూనస్ బుధవారం సందేశం ఇచ్చారు. ఎన్నికైన ప్రభుత్వానికి త్వరగా అధికారాన్ని బదిలీ చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన ఆయన, పోలింగ్ రోజున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఇతర వర్గాలు శాంతి, సహనం పాటించాలని కోరారు.“ఈ జాతీయ ఎన్నికల ద్వారా ప్రజలు తమ ఆశయాలను గౌరవించే, బాధ్యతతో పనిచేసే ప్రతినిధులను ఎన్నుకుంటారు” అని తెలిపారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, అందరికీ ఆమోదయోగ్యమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి బలం అని చెప్పారు. ఆ లక్ష్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. . బ్యాలెట్ పత్రాలు సహా అవసరమైన సామగ్రిని రిటర్నింగ్ అధికారులకు పంపిణీ చేశారు. భద్రతా సంస్థల సహకారంతో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.45 దేశాలు, సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ ఎన్నికలను పరిశీలిస్తున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో...
ఎన్నికల భద్రత కోసం దాదాపు 9 లక్షల చట్ట అమలు సిబ్బందిని మోహరించామని ఎన్నికల కమిషనర్ అబ్దుర్ రహ్మానెల్ మచుద్ తెలిపారు. రాజధానిలో కీలక ప్రాంతాల్లో ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్లు, రాపిడ్ యాక్షన్ టీమ్‌లను వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 42,659 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసుల అంచనా ప్రకారం సుమారు 43 వేల కేంద్రాల్లో 24 వేల కేంద్రాలు అధిక లేదా మోస్తరు ప్రమాదంగా గుర్తించారు. ఢాకాలోని 2,131 కేంద్రాల్లో 1,614 సున్నితమైన జాబితాలో ఉన్నట్లు పోలీసు నివేదిక తెలిపింది. అయితే ఢాకా నగరంలో రెండు కేంద్రాలనే ప్రమాదకరంగా గుర్తించామని సైన్యం వెల్లడించింది. మొదటిసారి డ్రోన్లు, శరీరంపై ధరించే కెమెరాలు వినియోగిస్తున్నారు. సుమారు 25 వేల బాడీ-వోర్న్ కెమెరాలు రంగంలో ఉంటాయి. వీటిలో కొన్నింటి ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 90 శాతం కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చారు. దాదాపు 12.7 కోట్ల ఓటర్లలో 3.58 శాతం మంది తొలిసారి ఓటు వేయనున్నారు.