Delhi Assembly Elecions : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నేడు.. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో?
ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రారంభమయింది
ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ అధికారులు చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 1.55 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 8వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఉచిత పథకాల హామీలను ప్రజలు ముందు ఉంచాయి. ఇప్పుడు ఓటర్ల టైం వచ్చింది. వారు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నది నేడు నిర్ణయం తీసుకోనున్నారు.
70 నియోజకవర్గాలకు...
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నేడు పోలింగ్ జరుగుతుంది. ఇందులో యాభై ఎనిమిది జనరల్ సీట్లు కాగా, పన్నెండు ఎస్సీ రిజర్వ్ సీట్లున్నాయి. పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికకరంగా మారింది. 83 లక్షల మంది పురుష ఓటర్లుండగా, 71 లక్షల మంది మహిళ ఓటర్లున్నారు. యువ ఓటర్లు 25 లక్షలుగా ఉంంది. తొలిసారి ఓటు వేసే వారు రెండు లక్షల మంది వరకూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓటర్లు ప్రశాంతంగా తమకు నచ్చిన వారికి ఓటు వేసుకునే వాతావరణాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది.
పోలింగ్ కోసం...
ఢిల్లీ పోలింగ్ కోసం మొత్తం 13,033 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1100 మంది వరకూ సగటున ఓటర్లు ఉండటంతో పెద్దగా వెయిట్ చేయకుండానే ఓటు వేసుకునే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే శిక్షణ ఇచ్చిన సిబ్బందిని పోలింగ్ కేంద్రంలో నియమించారు. 210 మోడల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 70 పోలింగ్ స్టేషన్లలో మహిళలే పోలింగ్ సిబ్బందిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా మేరకు గుర్తింపు కార్డును చూపి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలీసుల పహారా మధ్య పోలింగ్ కేంద్రాలు సురక్షితమైన ప్రదేశాల్లోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు ఢిల్లీలోని విద్యాసంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు కూడా నేడు పనిచేయవు. మరిచివరకు ఫలితం ఎలా ఉంటుందన్నది ఎనిమిదో తేదీ వరకూ వెయిట్ చేయాల్సిందే.