ఎన్నికల పోలింగ్‌లో వేసే 'సిరా' ఎక్కడ తయారవుతుందో తెలుసా?

భారతదేశంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు అనగానే ఈవీఎంలతో పాటు మనకు ఠక్కున గుర్తొచ్చే..

Update: 2023-11-27 15:54 GMT

భారతదేశంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు అనగానే ఈవీఎంలతో పాటు మనకు ఠక్కున గుర్తొచ్చే మరో అంశం.. సిరా చుక్క. సిరా మార్క్ చూపిస్తూ..నేను ఓటేశానోచ్ అని గర్వంగా చెప్పుకునేవారు ఎందరో ఉంటారు. ఓటు వేయగానే సిరా చుక్కతో ఉన్న వేలును చూపుతూ వాట్సాప్‌ స్టేటస్‌లు, ఫేస్‌బుక్‌లలో అప్‌లోడ్‌ చేస్తుంటారు. భారతదేశంలో ఈ సిరాను మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే ఓ కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. అంతేకాదు మన హైదరాబాద్‌లో కూడా తయారవుతుంది. అదే రాయుడు ల్యాబరేటరీస్. ప్రపంచంలోని చాలా దేశాల ఎన్నికల్లో ఈ సిరానే వాడుతున్నారు. సిరాను బాటిళ్లలలో నింపి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

100 దేశాలకు ఇక్కడి నుంచే..

భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌(ఎంపీవీఎల్‌) ఒకటైతే, హైదరాబాద్‌లోని రాయుడు ల్యాబరేటరీస్ మరొకటి. భారత ఎన్నికల సంఘం మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ సిరాను ఎక్కువగా వినియోగిస్తుండగా, ప్రపంచంలోని చాలా దేశాలు రాయుడు ల్యాబరేటరీస్ తయారు చేస్తోన్న సిరాను వాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాలకుపైగా ఈ సిరా ఎగుమతి అవుతుందట. ఇండియా, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా, బెనిన్, లిస్బెన్, మడగాస్కర్, నైజీరియా, మాలే, ఒమన్, మాల్దీవులు, వనౌతు, మోజాంబిక్, రువండా, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలు మా వినియోగదారులుగా ఉన్నాయని సిరా తయారీదారులు చెబుతున్నారు. ఈ నీలం రంగు సిరా 1962 ఎన్నికల్లో తొలిసారి ఉపయోగించారు. భారత తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఈ సిరాను ఎన్నికల్లో చేర్చాలని సూచించారు.

సిరాను తయారు చేయడానికి ఉపయోగించే యంత్రం

భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో రాయుడు ల్యాబ‌రేట‌రీస్ సిరానే ఉపయోగిస్తున్నార‌ట‌. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవాళ్లు ఇప్పుడు భారీ ఎత్తున సరఫరా చేస్తున్నారు.

అయితే కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (మైలాక్). భారత ఎన్నికల సంఘం కోసం అనేక ఏళ్లుగా దీన్ని ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ రెండు సంస్థ‌లు ఈ ఇంక్‌ను సరఫరా చేయ‌డం విశేషం. ఒక్క‌ భారత్‌లోనే కాకుండా.. అనేక దేశాల్లో ఈ సంస్థల‌ పట్ల మంచి విశ్వాసం ఉంది. చాలా దేశాల్లో పోలింగ్ నిమిత్తం ఈ సంస్థ సిరా సీసాలను ఉత్పత్తి చేసి, పంపిణీ చేస్తోంది. తాజాగా క‌ర్ణాటకలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌(ఎంపీవీఎల్‌) కాంబోడియా పార్లమెంట్ ఎలక్షన్ల కోసం పెద్ద ఎత్తున సిరా బాటిళ్లను రూపొందించి, పంపించడానికి ఏర్పాట్లు చేసింది.

1962లో చెరిగిపోని సిరాను ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబోరేటరీస్‌ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కర్మాగారానికి అప్పగించారు. నేరేడు రంగులో ఉండే సిరాలో 7.25 శాతం సిల్వర్‌ నైట్రేట్‌ ఉన్నందున వెంటనే చెరిగిపోదు. మొదట్లో ఎడమ చేతి వేలిపై సిరా చుక్కను పెట్టేవారు. 2006 ఫిబ్రవరి నుంచి ఓటర్ల ఎడమ చేతి వేలు–గోరుపై సిరాను గీతగా వేస్తున్నారు. ఈ సారి తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల సిరా సీసలను సరఫరా చేస్తున్నారు. ఒక్కో సీసా సిరాను గరిష్టంగా 700 మందికి వేయవచ్చట. ఒక లీటర్ ఎన్నికల ఇంక్ ధర రూ.12,700 వరకు ఉంటుందట.

మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవారు, 2004 తర్వాత ఇంక్‌ మార్కర్‌లను తీసుకొచ్చారు. మనదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి.


Full View


సిరా చుక్క... ఏముంది ప్రత్యేకత?

ఎన్నికల్లో వాడే సిరాను సెమి-పర్మినెంట్ ఇంక్‌గా చెప్పొచ్చు. అంటే కొద్ది రోజుల పాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట. ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతో పాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలుపై పెట్టిన తర్వాత 72 నుంచి 96 గంటల పాటు చెదిరిపోకుండా ఉంటుంది. అందుకే దొంగ ఓట్లను నివారించేందుకు ఈ సిరానే చాలా దేశాలు వాడుతుంటాయి.

Tags:    

Similar News