జర్నలిస్ట్ అంటూ పరిచయం చేసుకున్న మహిళ.. సీక్రెట్స్ లీక్ చేసిన సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ
టీవీ జర్నలిస్టులమని చెప్పుకుంటూ సీఆర్‌పీఎఫ్ అధికారికి పాక్ గూఢచారులు గాలం వేశారు.
టీవీ జర్నలిస్టులమని చెప్పుకుంటూ సీఆర్‌పీఎఫ్ అధికారికి పాక్ గూఢచారులు గాలం వేశారు. సమాచారం లీక్ చేసినందుకు డబ్బులు కూడా అందించారు. ఢిల్లీలో అరెస్టైన సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ మోతీరామ్ జాట్ పహల్గాం ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే హోంమంత్రి అమిత్‌షా పర్యాటన వివరాలు, 50 పర్యాటక ప్రాంతాల మూసివేత, సీఆర్‌పీఎఫ్ బలగాల సంఖ్య, పహల్గాం ఉగ్రవాదులు దాక్కున్నట్లు బలగాలు అనుమానిస్తున్న ప్రదేశాలు వంటి కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్లు గుర్తించారు. దాదాపు రెండేళ్లుగా టీవీ జర్నలిస్టుల ముసుగులో ఉన్న పాక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అంటూ ఓ మహిళ అతడిని సంప్రదించింది. వీరి మధ్య కొన్ని ఫోన్, వీడియో కాల్స్, మెసేజ్‌లు చోటుచేసుకొన్నాయి. పాక్‌లోని వ్యక్తులతో సంబంధాలు మొదలైన నాటినుంచి ప్రతినెలా నాలుగో తేదీన 3,500 రూపాయలు అతడికి అందాయి. ఇక కీలక సమాచారం అందజేసిన ప్రతిసారీ 12,000 రూపాయలు మోతీరామ్ జాట్ కు చెందిన అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయి.