దేశ రాజధానిని ఇంకా వెంటాడుతున్న మంకీపాక్స్ భయం

ఆమె గత నాలుగు నెలలుగా భారతదేశంలో ఉంటోంది.

Update: 2022-09-12 06:12 GMT

మంకీపాక్స్ భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఢిల్లీలో ఆదివారం నాడు ఏడో మంకీపాక్స్ వ్యాధి కలకలం మొదలైంది. మంకీపాక్స్ కేసులకు సంబంధించి నోడల్ ఆఫీసర్, ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్‌లో డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వినీత్ రెల్హాన్ మాట్లాడుతూ.. తాజాగా మంకీపాక్స్ బారిన పడిన రోగి నైజీరియాకు చెందిన 24 ఏళ్ల యువతి అని తేలింది. ఆమె గత నాలుగు నెలలుగా భారతదేశంలో ఉంటోంది. ఆమె ఢిల్లీలోని శారదా విహార్ ప్రాంతంలో నివసిస్తోంది. జ్వరం, గొంతునొప్పి, చేతులు, ముఖంపై బొబ్బలు వంటి లక్షణాలతో ఆమె ఆసుపత్రికి వచ్చినట్లు డాక్టర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె నమూనాలను ఎన్‌ఐవి పూణేకు పంపారు, అక్కడ సదరు రోగికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. "రోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించడానికి ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) బృందానికి సమాచారం అందించాము" అని డాక్టర్ వినీత్ రెల్హాన్ చెప్పారు.

ఢిల్లీలోని లోక్‌నాయక్‌ ఆస్పత్రిలో ఇప్పటి వరకు ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు మొత్తం ఏడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురిలో ఆరుగురు నైజీరియాకు చెందినవారు కాగా ఒకరు ఢిల్లీకి చెందినవారు. ఐదుగురు రోగులు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు. మంకీపాక్స్‌ను ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో పడకలను, గదులను రిజర్వ్ చేసింది. లోక్ నాయక్ ఆసుపత్రి, గురు తేగ్ బహదూర్ ఆసుపత్రి, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రి లలో మంకీపాక్స్ కు చికిత్సను అందించనున్నారు. అలాగే మూడు ప్రైవేట్ ఆసుపత్రులు కైలాష్ దీపక్ ఆసుపత్రి, MD సిటీ ఆసుపత్రి, బాత్రా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లను మంకీపాక్స్ అనుమానిత, ధృవీకరించబడిన కేసుల కోసం ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News