Dhanteras : ధన్ తెరాస్ ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు ఏం చేయాలంటే?

దీపావళి పండగ నాడు ధన్ తెరాస్ జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది.

Update: 2025-10-18 03:47 GMT

దీపావళి పండగ నాడు ధన్ తెరాస్ జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. నేడు దేశమంతటా థన్ తెరాస్ ను జరుపుకుంటున్నారు. దీపావళి వేడుకలకు శ్రీకారం చుట్టే ధన్ తెరాస్‌ నాడు ప్రజలు ఆయురారోగ్య దేవుడు ధన్వంతరిని, సంపద సమృద్ధి దేవత లక్ష్మి దేవిని పూజిస్తారు. ‘ధన్‌’ అంటే ధనం, ‘తేరస్‌’ అంటే కృష్ణ పక్ష త్రయోదశి అని అర్థం. ఆ రోజు బంగారం, వెండి నగలు, పాత్రలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. దీని ద్వారా లక్ష్మీదేవి, ధనాధిపతి కుబేరుడిని గృహాల్లో ఆహ్వానించినట్లవుతుందని విశ్వాసం ఉంది. ఆ రోజున విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే సంపదలో శుభఫలితాలు దక్కుతాయని నమ్మకం.

లక్ష్మీదేవిని పూజించే...
ధన్వంతరి ఆరాధనకు ఈ పర్వదినానికి ప్రత్యేకత ఉంది. ఆయన ఆయుర్వేద దేవుడు. సముద్రమథనంలో అమృతకలశం చేత పట్టుకొని ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అదే సమయంలో అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవి, ధనాధిపతి కుబేరుడు కూడా సముద్రం నుంచి వెలిశారు. వారిని గౌరవించే భావనతో ఈ రోజున ప్రజలు పూజలు చేస్తారు. ధన్ తెరాస్‌తో దీపావళి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈ సమయాన్ని కొత్త పెట్టుబడులకు, వ్యాపార ఆరంభాలకు అనుకూలంగా భావిస్తారు. గృహాల పరిశుభ్రత, మనసు–మనోభావాల శుద్ధి చేసుకునే ఆచారం కూడా ఈ రోజుతో ముడిపడి ఉంది.
పురాణ గాధ ఏంటంటే?
పురాణాలు పేర్కొన్నథ ప్రకారం, హిమ రాజుకు పదహారేళ్ల వయసున్న కుమారుడు వివాహమైన నాలుగో రోజు పాముకాటు వల్ల చనిపోతాడని జాతకంలో చెప్పారు. దాన్ని నివారించేందుకు ఆ యువరాణి తన ఇంటి ముందు బంగారం, వెండి నాణేలను పోగేసి దీపాలను వెలిగించింది. రాత్రంతా పాటలు పాడుతూ భర్తను మేల్కొలిపి ఉంచింది. ఆ సమయంలో యముడు పాము రూపంలో వచ్చి ఆ ప్రకాశానికి తట్టుకోలేక నాణేల దగ్గర కూర్చుని పాటలు విన్నాడు. ఉదయం కావడంతో వెనుదిరిగిపోయాడు. అప్పటి నుంచి ఆ రోజు యమదీపం వెలిగించడం, ధన్ తెరాస్‌ జరుపుకోవడం ఆచారంగా మారింది.







Tags:    

Similar News