Census : జనగణన మొదలయితే.. నష్టం ఈ ప్రాంతాలకేనా?

దేశంలో జనగణనకు రంగం సిద్ధమయింది.

Update: 2026-01-10 05:04 GMT

దేశంలో జనగణనకు రంగం సిద్ధమయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి తొలిదశ జనగణన ప్రారంభం కానుంది. దేశంలో తొలిసారిగా డిజిటల్‌ విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. దేశంలో జనగణన తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి రాష్ట్రానికి నెల రోజుల వ్యవధి ఉంటుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ ను కూడా కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. పదేళ్లకోసారి దేశవ్యాప్తంగా నిర్వహించే జన గణన 2021లో చేపట్టాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా దీనిని చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం రెండు దశల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

తొలిదశలో ఇంటి వివరాల సేకరణ...
తొలిదశలో ఇంటి వివరాల సేకరణ, 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటోతేదీ వరకూ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ దఫా జనాభా లెక్కింపు డిజిటల్‌ విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. మొబైల్‌ యాప్‌ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరిస్తామని, స్వీయ గణనకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు, జనగణనతోపాటే కుల గణనను కూడా చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. పారదర్శకంగా ఇళ్ల వివరాల సేకరణకు అనుసరించాల్సిన మార్గాలపై అన్ని రాష్ట్రాలు, జిల్లా స్థాయి అధికారలకు దిశానిర్దేశం చేశారు.
తొలి దశలో మాత్రం...
ఇళ్ల వివరాల సేకరణతో పాటు జనగణన పక్కాగా సేకరించి అనంతరం వాటిని పొందుపర్చడం ద్వారా తర్వాత దేశంలో పార్లమెంటు నియోజకవర్గాల పెంపుదలకు ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది. అందువల్లనే ఈసారి జరిగే జనగణన రాజకీయ నేతలకు కీలకమని చెప్పాలి. పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఇటీవల హోం మంత్రి అమిత్ షా వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతాయని చెప్పడం కూడా ఇప్పుడు జరిగే జనగణనను దృష్టిలో ఉంచుకుని అన్నారు. మంచుమయ ప్రాంతాల్లో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబరు నుంచి అక్టోబరు 1 వరకు నిర్వహించనున్నారు. మంచు ప్రాంతాల జాబితాలో జమ్ముకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు ఉన్నాయి. దేశంలోని అన్ని ఇతర ప్రాంతాల్లో జనగణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది.


Tags:    

Similar News