Delhi : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..హైబ్రిడ్ విధానంలో పాఠశాలలు

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ఈరోజు మరింతగా క్షీణించింది. వాయు కాలుష్యం పెరిగింది

Update: 2025-11-12 04:35 GMT

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ఈరోజు మరింతగా క్షీణించింది. వాయు కాలుష్యం పెరిగింది ఉదయం 8 గంటలకు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 413గా నమోదయింది. దీంతో డేంజర్ జోన్ లో ఢిల్లీ చేరినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ అంతటా గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమల్లో ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన వివరాల ప్రకారం, ఢిల్లీలోని ఎక్కువ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటింది. వజీర్పూర్‌ ప్రాంతంలో 459గా నమోదై అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. ఎన్ఎస్ఐటీ ద్వారక కేంద్రం వద్ద 215 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా నమోదైందని అధికారులు వెల్లడించారు. .

అనేక ప్రాంతాల్లో కాలుష్యంగా...
అలీపూర్‌ 431, ఆనంద్‌ విహార్‌ 438, అశోక్‌ విహార్‌ 439, అయా నగర్‌ 405, బవానా 451, బురారీ క్రాసింగ్‌ 439, చాందినీ చౌక్‌ 449, ఐటీవో 433, జహంగీర్‌పురి 446, రోహిణి 442, పట్పర్‌గంజ్‌ 436 వంటి ప్రాంతాల్లో కూడా తీవ్ర కాలుష్యం నమోదైంది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో పాటు గాలి నాణ్యత పూర్తిగా పడిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ బయటకు వస్తే అవసరమైన మాస్కులు ధరించి అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే వాయు కాలుష్యం, గాలి నాణ్యత తగ్గడంతో ఢిల్లీలో అనేక మంది చర్మసంబంధిత వంటి రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయాసంతో కూడా అవస్థలు పడుతున్నారు.
అనారోగ్యం బారిన...
ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ లలో పంట వ్యర్థాలను దహనం చేస్తుండటంతో ఈ తీవ్రత ఎక్కువయిందని అధికారులు చెబుతున్నారు. గాలి నాణ్యత మరింత దిగజారడంతో కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సంస్థ GRAP-III దశ పరిమితులను ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతమంతా అమలు చేస్తోంది. తీవ్ర కాలుష్య పరిస్థితుల్లో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో హైబ్రిడ్‌ విధానం అమలు చేయాలని ప్రకటించారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.





Tags:    

Similar News