స్కైలాబ్ రివ్యూ

స్కైలాబ్ చిత్రంలో మూడు ప్రధాన పాత్రల్లో నటించిన నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలు వారి పాత్రలకు న్యాయం చేశారు

Update: 2021-12-04 10:01 GMT

చిత్రం - స్కైలాబ్

విడుదల తేదీ - 04.12.2021
నటీనటులు : సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, సుబ్బరాయ శర్మ, తనికెళ్ళ భరణి, అరిపిరాల సత్యప్రసాద్, నారాయణరావు, తులసి, తరుణ్ భాస్కర్ తదితరులు
సంగీతం : ప్రశాంత్ ఆర్.విహారి
సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాది
ఎడిటింగ్ : రవితేజ గిరిజాల
నిర్మాణం : బ్రైట్ ఫీచర్స్, నిత్యామీనన్ కంపెనీ
రచన, దర్శకత్వం : విశ్వక్ ఖండేరావు
ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 1970 ద‌శ‌కం చివ‌ర్లో స్కైలాబ్ సృష్టించిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. నాసా ప్రయోగించిన ఆ అంత‌రిక్ష నౌక ఎప్పుడు భూమ్మీద ప‌డిపోతుందో అంటూ కొన్ని దేశాల‌కి చెందిన ప్రజ‌లు కొన్నాళ్లపాటు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఆఖరికి ఆ గండం ఎలాగోలాగా గట్టెక్కింది. అలా భయంభయంగా కాలం వెళ్లదీసిన ప్రాంతాల్లో క‌రీంన‌గ‌ర్ జిల్లా, బండ‌లింగంప‌ల్లి కూడా ఒక‌టి. స్కైలాబ్ భూమి మీద పడుతుందని తెలిశాక ఆ ఊరిలో వాళ్లు ఏం చేశారు ? ఎలా బ్రతికారు ? స్కైలాబ్ వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందో.. వాటన్నింటినీ రెండున్నర గంటల్లో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు విశ్వక్ ఖండేరావు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ చిత్రం కథేంటే తెలుసుకుందాం.
కథ ...
జర్నలిస్ట్ గౌరి (నిత్యామీనన్) హైదరాబాద్‌లో ప్రతిబింబం అనే పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఆమెను ఉద్యోగం నుంచి తీసివేయడంతో సొంత ఊరైన బండ్లలింగంపల్లికి వస్తుంది. కానీ రైటర్ గా తానేంటో నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంటుంది. అదే ఊరికి చెందిన డాక్టర్ ఆనంద్ (సత్యదేవ్) కూడా ఉద్యోగం నుంచి సస్పెండై.. సొంత ఊళ్ళో క్లినిక్ పెట్టుకోవాలని ఆశతో వస్తాడు. మరో వైపు రామారావు సుబేదార్ (రాహుల్ రామకృష్ణ) తన ఫ్యామిలీ అప్పులు తీర్చడం కోసం నానా తంటాలు పడుతుంటాడు. ఈ ముగ్గురు తమ జీవితాల్లో ఊహించని బ్రేక్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ తరుణంలో నాసా అంతరిక్షంలో నిర్మించిన స్కైలాబ్ లో సాంకేతిక లోపాల కారణంగా భూమ్మీద పడుతుందని.. దానివల్ల కరీంనగర్ జిల్లా బండ్లలింగంపల్లి గ్రామానికి పెద్ద ప్రమాదం ఉందని రేడియో వార్తల్లో వస్తుంది. ఇది విన్న గ్రామస్తులంతా ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతుంటారు. నిజంగానే స్కైలాబ్ బండ్లలింగంపల్లిలో పడిందా? స్కైలాబ్ వల్ల గౌరి, ఆనంద్, రామారావు జీవితాల్లో జరిగిన మార్పు ఏంటో తెలుసుకోవాలంటే.. థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
స్కైలాబ్ చిత్రంలో నటించిన నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అరుదైన నేపథ్యంతో, 1970 బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమాలో దర్శకుడు కామెడీతోపాటు బ‌ల‌మైన భావోద్వేగాలు, డ్రామాను చూపించే ప్రయత్నం చేశాడు.. కానీ అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై చూపించడంలో తడబడ్డాడనే చెప్పాలి. దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
స్కైలాబ్ చిత్రంలో మూడు ప్రధాన పాత్రల్లో నటించిన నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలు వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. ముఖ్యంగా గౌరీ పాత్రలో నిత్యామీనన్ ఒదిగిపోయారు. సినిమాలో అంత లీనమైపోయారు ఆవిడ. ఇక సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలైతే పతాక సన్నివేశాల్లో తమలోని నటుడిని బయటికి తీశారు. గౌరి అసిస్టెంట్‌గా క‌నిపించే విష్ణు, తుల‌సి, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు.
ప్లస్ పాయింట్స్
పతాక సన్నివేశాలు
1970 బ్యాక్ డ్రాప్ లో కథ
నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణల నటన
మైనస్ పాయింట్స్
సాగదీతగా అనిపించే కథ
ప్రథమార్థంలో కామెడీ పండకపోవడం

స్కైలాబ్ భూమ్మీదే కాదు.. ప్రేక్షకుడి మీద కూడా పడలేదు


Tags:    

Similar News