‘సినిమా తీయడం పెద్ద విషయం కాదు అన్నయ్యా.. దాన్ని రైట్ టైంలో.. పోటీ చిత్రాలు లేని సమయంలో థియేటర్లలో రిలీజ్ చేసి.. కలెక్షన్లు రాబట్టడం ముఖ్యం’ అనేది ఆధునిక టాలీవుడ్ నీతి. సాధారణంగా ఒక సినిమా హిట్ అయిందంటే.. ఆ సినిమా కథ ఎంత గొప్పగా ఉన్నదో, నటీనటులు ఎంత గొప్పగా చేశారో, దర్శకుడు ఎంత గొప్పగా తీశాడో.. అని ప్రతిభల గురించి అంచనాలు వేసే రోజులు మారిపోయాయి. సినిమా హిట్ అయిందంటే.. థియేటర్లను సరిగ్గా మానిప్యులేట్ చేశారా లేదా... సరైన థియేటర్లలో సరైన సీజన్ లో రిలీజ్ చేశారా లేదా... పోటీగా సేమ్ కైండ్ భారీ చిత్రాలు లేకుండా.. స్ట్రాటెజీ ఫాలో అయ్యారా లేదా? అనే అంశాలను బట్టి డిసైడ్ అవుతోంది.
ఈ మార్కెటింగ్ సిద్ధాంతానికి తాజా ఉదాహరణ టాలీవుడ్ లోనే కనిపిస్తోంది. రాంచరణ్ హీరోగా చేస్తున్న ధ్రువ చిత్రం.. అనేక వాయిదాల తర్వాత.. డిసెంబరు 9 వతేదీన రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. అల్లు అరవింద్ దీనికి నిర్మాత. మరి తమిళ- తెలుగుల్లో మాస్ మార్కెట్ మీద కన్నేసి రూపొందుతున్న సూర్య ‘సింగం 3’ చిత్రం షెడ్యూలు ప్రకారం.. 16వ తేదీ విడుదల కావాలి. అయితే దానిన మరో వారం వెనక్కి జరిపారుట.
ధ్రువ- సింగం3 రెండూ పోలీస్ సినిమాలే. రెండూ మాస్ సినిమాలే. ఈ లెక్కన రెండింటి మధ్య పోటీ కలెక్షన్ల పరంగా ఇద్దరికీ దెబ్బే అవుతుంది. అసలే చాలా సంవత్సరాలుగా హిట్ అనేది లేకుండా మొహం వాచిపోయి ఉన్న హీరో రాంచరణ్.. ధ్రువతోనైనా దాన్ని రుచిచూడాలని ఉవ్విళ్లూరుతూ... అనేక వాయిదాల తర్వాత.. ఓ రైట్ సీజన్ ముహూర్తం పెట్టుకున్నారు. సరిగ్గా వారానికెల్లా.. సింగం 3 వచ్చేస్తే గనుక.. ధ్రువ కలెక్షన్లు అక్కడితో పడుకుంటాయని , అందుకే ఉభయ తారకంగా దాన్ని వెనక్కి జరిపించారని ఓ ప్రచారం జరుగుతోంది.