2014 లో లౌక్యం చిత్రంతో విజయం అందుకున్న హీరో గోపీచంద్ కు తరువాతి రెండు సంవత్సరాలు గడ్డు కాలంగానే గడిచాయి. లౌక్యం విజయం తరువాత యూ.వి క్రియేషన్స్ వారు కొత్త దర్శకుడు రాధ కృష్ణ కుమార్ కి అవకాశం ఇచ్చిన జిల్ చిత్రంతో స్టైలిష్ లుక్ లో కనిపించినప్పటికీ ఆశించిన స్థాయి విజయం అందలేదు గోపీచంద్ కి. ఇక ఆ చిత్రం తరువాత లౌక్యం కథనం అందించిన రచయిత కోన వెంకట్ ని నమ్మి సౌఖ్యం చిత్రం చేసి ఘోర వైఫల్యాన్ని చవి చూసాడు. సౌఖ్యం దెబ్బ నుంచి బైటకి రావటానికి రెండు చిత్రాలు పట్టాలెక్కించినప్పటికీ ఆ చిత్రాలు నేటికీ విడుదల కాకపోగా అవి చిత్రీకరణ దశలో ఉండగానే మూడవ చిత్రం పట్టాలెక్కించాడు గోపీచంద్. దానితో 2016 లో ఒక్క విడుదల కూడా సాధ్యపడలేదు ఈ బిజీ హీరోకి.
ఏడాది క్రితమే బి.గోపాల్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభం అయినప్పటికీ అనివార్య కారణాల వలన ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సజావుగా సాగక చిత్రీకరణ మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా మళ్లీ ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి అన్ని అవాంతరాలు తొలిగి మొదలు కాబోతుంది. ఏ.ఎం.జ్యోతి కృష్ణ దర్శకత్వంలో జరుగుతున్న ఆక్సీజన్ చిత్రం దర్శకుడితో గోపీచంద్ కి వచ్చిన అభిప్రాయం భేదాల వలన చిత్రీకరణ నిలిచిపోయింది. నిర్మాత, దర్శకుడి తండ్రి ఏ.ఎం.రత్న చొరవతో జ్యోతి కృష్ణ, గోపీచంద్ ల మధ్య మనస్పర్థలు తొలగి తిరి చిత్రీకరణ కొద్దీ రోజుల క్రితమే ప్రారంభం ఐయ్యింది. ఈ రెండు చిత్రాల కన్నా చాలా ఆలస్యంగా మొదలు అయిన సంపత్ నంది చిత్రం చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది.
గోపీచంద్ నటిస్తున్న ఈ మూడు చిత్రాలు అతి తక్కువ గ్యాప్‌తో 2017 ప్రధమార్ధంలోనే విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతానికి ఏ మాత్రం అంచనాలు లేని ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ మీద ఏ మేర ప్రభావం చూపుతాయో మరి.