బాలీవుడ్ సూపర్‌హీరోకు టాలీవుడ్ రిలీజ్ కష్టాలు

Update: 2016-12-08 07:59 GMT

బాలీవుడ్లో అగ్ర కథానాయకుల జాబితాలో దశాబ్ద కాలంగా చోటు దక్కించుకుంటునప్పటికీ ఖాన్ల త్రయానికి పోటీగా నిలవటంలో మాత్రం వెనుకంజలోనే ఉంటున్నాడు బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో హ్రితిక్ రోషన్. ఇటీవలి కాలంలో హ్రితిక్ వరుస వైఫల్యాలతో సతమతమవుతూ మోహాంజెదరో చిత్రం తన మార్కెట్ పెంచే చిత్రం అవుతుంది అని ఆశ పడ్డాడు. కానీ ఆ చిత్రం చారిత్రాత్మక కథతో తెరకెక్కినప్పటికీ హ్రితిక్ రోషన్ గత చిత్రాల స్థాయిలో కూడా ఆడకపోవడంతో పాటు హ్రితిక్ కి లేనిపోని తలవంపులు తెచ్చింది. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు పోటీగా నిలవటానికి విదేశీ మార్కెట్ పెంచుకోవటం కన్నా ముందు దక్షిణ భారత దేశంలో మార్కెట్ సుస్థిరం చేసుకోవాలని ఆరాట పడుతున్నాడు హ్రితిక్ రోషన్.

సౌత్ లో అత్యధిక మార్కెట్ వున్నది తెలుగు రాష్ట్రాల్లోనే. అయితే హ్రితిక్ రోషన్ నటించిన కహోనా ప్యార్ హై చిత్రం నుంచి క్రిష్ వరకు పలు చిత్రాలు తెలుగులోకి కూడా అనువాదమయ్యాయి. హ్రితిక్ రోషన్ తదుపరి చిత్రంగా విడుదలకు సిద్ధం కాబోతున్న కాబిల్ చిత్రాన్ని తెలుగులో బలం పేరుతో అనువాదం చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న యామి గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం కావటం బలం చిత్రానికి కలిసొచ్చే అంశం. ఈ చిత్ర ప్రచారానికి హైద్రాబాద్ నగరంలో పలు ఈవెంట్స్ చేయటానికి కూడా సిద్ధపడుతున్నాడు హ్రితిక్.

తెలుగులో మార్కెట్ సుస్థిరం చేసుకోవాలని నిర్ణయించుకున్న హ్రితిక్ కి ఎన్ని అంశాలు కలిసొచ్చిన్నా జనవరి నెలలో విడుదల కాబోతున్న కాబిల్ అనువాద రూపానికి మాత్రం మన పెద్ద హీరోల నుంచి గట్టి పోటీనే ఎదురు కానుంది. సంక్రాంతికి ఇప్పటికే థియేటర్లు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం బుక్ ఐపోగా హిందీ వెర్షన్ కి సమాంతరంగా తెలుగులో విడుదలకు పలు ఇబ్బందులు ఎదురు అయ్యే ప్రమాదం లేకపోలేదు.

Similar News