ప్రస్తుతం యావత్ భారత దేశంలో సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న సినిమా మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్. ఇప్పటికే కరణ్ జోహార్, గుల్జార్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు దంగల్ చిత్రాన్ని చూసి వారి స్పందనను మీడియాతో పంచుకుంటూ చిత్రాన్ని కొనియాడగా ప్రచారంలో భాగంగా విడుదల చేసిన వీడియో సాంగ్స్ కి ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈ చిత్ర కథ కథనాలు ప్రేక్షకులను ఎంతలా అలరించనున్నాయో కానీ ఈ చిత్రం కోసం ఆమిర్ ఖాన్ తన శరీరాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేసి భారీగా శరీర బరువులో వ్యత్యాసం చూపటం ప్రేక్షకులను విపరీతంగా దంగల్ వైపు ఆకర్షించింది. ఒక నటుడి శ్రమ చిత్రానికి అంతటి ప్రచారం తీసుకు రావటం సాధారణమైన విషయం కాదు. ఆమిర్ ఖాన్ తన ప్రతి చిత్రానికి ఏదో ఒక వైవిధ్యం కనపరుస్తూ ప్రతి చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంటారు.
తమిళ హీరోలలో ఆమిర్ తరహాలోనే పాత్ర కోసం హద్దులు మీరి మానసిక శారీరక ఒత్తిళ్లను ఎదురుకోవటం అలవాటు వున్న నటుడు విక్రమ్. ఇక తెలుగు నటులలో అటువంటి కథానాయకులు వెతికినా కనపడరు. ఎవరికి వారు వారికి వున్న ఫ్యాన్ బేస్ ని సమర్ధించుకునే రీతిలో చిత్రాలను ఎంచుకోవటమే తప్ప కంఫర్ట్ జోన్ ధాటి బైటకి వచ్చి వైవిధ్య కథలను ఒప్పుకునే సాహసం చేసే కథానాయకులు తెలుగులో కరువు అయిపోయారు అనేది వాస్తవం. మన హీరోల నాలుగు చిత్రాల పోస్టర్స్ పక్క పక్కన పెడితే ఏది ఏ చిత్రం లోనిదో చెప్పటం కూడా కష్టమే. మూస ధోరణిలో వేషధారణలు కూడా మన వారి చిత్రాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగటానికి అడ్డుగోడలా నిలుస్తున్నాయని ఇప్పటికైనా మన కథానాయకులు గుర్తించాలి.