ఏ భాషల్లో చిత్రాలు నిర్మితమవుతాయో ఆయా భాషల్లో ఒక్కో సూపర్ స్టార్ ఉంటుండటం సహజం. అయితే వీరిలో రజని కాంత్ కి వున్నా సూపర్ స్టార్ ఇమేజ్ భాషకో ప్రాంతానికో చెందినది కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమాన సంఘాలు వున్నాయి. ఆయన చిత్ర విడుదల సమయానికి పారా మౌంట్ వంటి అతి పెద్ద హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా అడ్డు తప్పుకుని థియేటర్లను రజని కాంత్ కి కేటాయించిన సందర్భాలు కూడా వున్నాయి. గత ఆరు సంవత్సరాలలో విదేశీ మార్కెట్ ని స్వదేశం లో పాపులారిటీ ని భారీగా పెంచుకున్న మరో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. వీరిద్దరూ మల్టీ స్టారర్ చేస్తే ఆ చిత్రం ఏ స్థాయి సంచలనాలకు దారి తీస్తుందో ఊహించలేము కూడా. ముంబైలో జరిగిన 2 .0 ఫస్ట్ లుక్ లాంచ్ లో రజని, సల్మాన్ లు ఒకరితో ఒకరు కలిసి పని చేయాలన్న కోరికను బయటపెట్టారు.
రజని కాంత్ తో లింగా చిత్రం నిర్మించి ఘోర ఆర్ధిక నష్టాలు ఎదుర్కొన్న నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కి రజని కాంత్ మరో సారి సినిమా తీసే అవకాశం ఇవ్వటానికి సిద్ధంగా వున్నారు. భజరంగి భాయ్ జాన్ తో సల్మాన్ కు భారీ విజయాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ రాక్ లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ . ఆ ఇద్దరి స్టార్లతో వున్న వ్యక్తిగత అనుబంధంతో ఆయన మల్టీ స్టారర్ కథలతో ఆ ఇద్దరు స్టార్స్ తో చర్చలు జరుపుతున్నారు. ఇంకా ఏ కథా ఫైనల్ కానప్పటికీ త్వరలో ప్రాజెక్ట్ ఒప్పందాలు కుదిరే అవకాశాలు వున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మాత్రం దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చు. సల్మాన్ ఖాన్ కి ఇప్పటికే వున్న పలు కమిట్మెంట్స్ తో పాటు రజని కాంత్ నటిస్తున్న 2 .0 వచ్చే ఏడాది దీపావళికి సిద్ధం కానుండగా, ఆయన ఇప్పటికే రంజిత్ దర్శకత్వంలో కబాలి సీక్వెల్ కి అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ కమిట్మెంట్స్ పూర్తి కావటానికి రెండు నుంచి మూడు సంవత్సరాల వ్యవధి పట్టొచ్చు. ఆ తరువాతే రాక్ లైన్ వెంకటేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. అది కూడా అన్నీ చర్చల దశలోనే సఫలమైతేనే.