నాచురల్ స్టార్ నాని సరసన మజ్ను చిత్రంలో నటించటం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన కథానాయిక అను ఇమ్మాన్యుయేల్. మోడలింగ్ నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చిన ఈ మలయాళీ భామకు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి ఏడాదే త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ ల క్రేజీ ప్రాజెక్ట్ లోకి ప్రవేశం దొరికింది. ఈ సదవకాశంతో ఉబ్బితబ్బిబు అయిపోతోంది అను ఇమ్మాన్యుయేల్. ఇప్పటికే మజ్ను తరువాత రెండు చిత్రాలు ఒప్పుకోగా వాటిలో ఒకటి రాజ్ తరుణ్ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరొకటి గోపి చంద్ సరసన నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఇంతలో ఈ క్రేజీ ఆఫర్ అను ని వెతుక్కుంటూ వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం తనను వరించటం తన అదృష్టం అని చెప్తూ పట్టలేని ఆనందంతో ఆ చిత్ర వివరాలు పంచుకుంటూ, "పవర్ స్టార్ సినిమాలో కనిపించాలి అంటే కనీసం ఐదు సంవత్సరాలు అయినా పడుతుంది అనుకున్నాను. కానీ అనూహ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రానికి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఆఫర్ చేయటంతో వెంటనే ఒప్పేసుకున్నాను. ఫస్ట్ హీరోయిన్ గా కీర్తి సురేష్ అప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. త్రివిక్రమ్ యాక్టింగ్ వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. స్టోరీ రీడింగ్ సెషన్స్ లో కూడా పాల్గొంటున్నాను. ఈ చిత్రంలో నాకు కీర్తి సురేష్ కాంబినేషన్లో కూడా కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వున్నాయి." అంటూ సెలవిచ్చింది అను ఇమ్మాన్యుయేల్.