ఆమిర్, వర్మ, సూర్యలకు భయపడని సప్తగిరి

Update: 2016-12-07 06:56 GMT

సునీల్, శ్రీనివాస్ రెడ్డి ల తరహాలో హాస్య నటుడిగా వెలుగొందుతున్న సప్తగిరి కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ముందుగా కాటమరాయుడు అనే టైటిల్ ఖరారు చేసుకుని ఆ పేరు త్యాగం చేయటంతో సప్తగిరి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్ కి భీభత్సమైన హైప్ వచ్చింది. ఆ టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం వదులుకోవటం, ఆ విషయాన్ని పవర్ స్టార్ స్వయంగా పబ్లిక్ వేడుకలో తెలియపరచటం తో సప్తగిరి ఎక్స్ ప్రెస్ జనాల్లోకి ఖర్చు లేని ప్రచారం రూపేణా చేరిపోయింది. ఈ చిత్రం గత నెలలోనే విడుదలకు సిద్దమైపోగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన కరెన్సీ రద్దు చర్యతో విడుదల వాయిదా వేసుకున్నాడు సప్తగిరి.

నరేంద్ర మోడీ కైతే జంకాడు కానీ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డ్రీం ప్రాజెక్ట్ వంగవీటి, ఆమిర్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ చిత్రం దంగల్ (తెలుగులో యుద్ధం), సూర్య సూపర్ హిట్ సిరీస్ సింగం మూడవ భాగం ఎస్ 3 లకు మాత్రం భయపడటం లేదు. ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ విడుదల అవుతున్న డిసెంబర్ 23 నే సప్తగిరి ఎక్స్ ప్రెస్ విడుదల కాబోతుంది అని ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచాడు. రానున్న రెండు మూడు రోజులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ప్రదర్శన వేసి చిత్రాన్ని చూపించి ఆశీర్వాదం తీసుకుంటానని సప్తగిరి తెలిపాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో వేడుకలో ఈ చిత్రం చూడాలని వుంది అని పవన్ వేదిక మీద ప్రకటించిన సంగతి విదితమే.

Similar News