నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను ఏకంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో టెలీకాస్ట్ చేశారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంపై ఆ చిత్ర నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో తండేల్‌ను ప్రదర్శించారని తెలుసుకున్నామని, ఇది చట్ట విరుద్ధం, అన్యాయం మాత్రమే కాదు సినిమాకు జీవం పోయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోన్న ఎంతోమంది వ్యక్తులను అవమానించడమేనని అన్నారు. ఒక సినిమా ఎంతోమంది ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతల కల అని బన్నీ వాసు తెలిపారు. దీనిపై కఠినచర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును బన్నివాసు కోరారు.