రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’కి ఏపీ హైకోర్టు నోటీసులు..

రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’కి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక ప్రాంత ప్రజలని, ఒక సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా..

Update: 2023-08-31 13:30 GMT

అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ బ్యానర్ పై రవితేజ (Raviteja) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). 19వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ లోని స్టూవర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన గజదొంగగా చలామణి అయిన టైగర్ నాగేశ్వరరావు లైఫ్ స్టోరీతో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కొత్త డైరెక్టర్ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్‌ విషయంలో సినీ నిర్మాతలకు ఏపీ హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. స్టువర్టుపురం గ్రామ ప్రజల గౌరవాన్ని, ఎరుకల సామాజికవర్గ మనోభావాలను దెబ్బతీసేలా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా తెరకెక్కుతుందని చుక్కా పాల్‌రాజ్‌ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం చిత్ర నిర్మాతలను ప్రశ్నిస్తూ, వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
ఒక ప్రాంత ప్రజలని, ఒక సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా ఎలా ప్రవర్తిస్తారు అంటూ ప్రశ్నించింది. అసలు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ తీసుకోకుండా టీజర్ ని ఎలా రిలీజ్ చేస్తారు? ఇటువంటి టీజర్ తో సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించింది. వీటికి వివరణ ఇవ్వాలంటూ సినీ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కి నోటీసులు జారీ చేసింది. అలాగే సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ చైర్‌పర్సన్ ని కూడా ఈ పిటిషన్ లో జతచేయాలంటూ పిటిషనర్‌కు సూచించింది.
ఈ నోటీసులతో టైగర్ నాగేశ్వరరావు నిర్మాతకు సమస్య ఎదురైనట్లు అయ్యింది. మరి దీనిపై నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ ఈ మూవీలో నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌ చాలా విరామం తరువాత మళ్ళీ ఈ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.


Tags:    

Similar News