IBomma : ఐబొమ్మ రవికి ఇంత మద్దతు సోషల్ మీడియాలో ఎందుకో అర్థమయిందా?

ఐబొమ్మ ఇమ్మడి రవిపై సోషల్ మీడియాలో మద్దతు రావడానికి కారణాలపై టాలీవుడ్ పెద్దలు ఆలోచించాలి.

Update: 2025-11-23 08:16 GMT

ఐబొమ్మ ఇమ్మడి రవిపై సోషల్ మీడియాలో మద్దతు రావడానికి కారణాలపై టాలీవుడ్ పెద్దలు ఆలోచించాలి. గతంలో ఎన్నడు లేని విధంగా సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవిని రాబిన్ హుడ్ తో పోలుస్తూ అనేక మంది పోస్టులు పెడుతున్నారు. చట్టపరంగా రవి చేస్తున్నది తప్పే. కానీ అదే సమయంలో వందల రూపాయలు టిక్కెట్ పెట్టి సినిమా చూడలేని వారికి ఐ బొమ్మ ఒక వరంగా మారిందన్నది వారి మాటల్లో కనపడుతుంది. కొత్త సినిమాలు అందులోనూ ప్రముఖ హీరోలు విడుదలయిన మూవీలు తొలి రోజు చూడాలని అభిమానులు కోరుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితి చాలా మందికి సహకరించదు. వందల రూపాయల టిక్కెట్లు పెట్టి కొనుగోలు చేయడం సాధ్యం కాకపోవడంతో తన అభిమాన హీరోను ఐ బొమ్మలో చూసుకుని కేరింతలు కొట్టడానికి అలవాటు పడ్డారు.

నిర్మాతలు.. దర్శకులు...
ముందుగా నిర్మాతలు, దర్శకులు కూడా ఆలోచన చేయాలన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. తక్కువ బడ్జెట్ తో విడుదలయి ఇటీవల అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదే సమయంలో వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, అత్యధిక పారితోషికాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, చివరకు సినిమా పేరు రివీల్ చేయడానికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆ మొత్తాన్ని టిక్కెట్ల రూపంలో రాబట్టుకోవడం అంటే ఎలా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే ఐ బొమ్మ రవికి ఎక్కువగా నేటి యువత అండగా నిలబడుతుంది. అతను తప్పు చేయవచ్చు కానీ, తమకు అందని వినోదాన్ని ఏ మాత్రం ఖర్చు లేకుండా చూపిస్తున్నాడని, అతను నేరం చేశాడని ఎలా అంటామని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
అప్పుడే చిత్ర పరిశ్రమకు...
అలాగని ఇమ్మడి రవిని చేసిన పనిని ఎవరూ సమర్థించడానికి వీలులేదు. చిత్ర పరిశ్రమకు గండి పడుతుంటే లక్షలాది మంది కార్మికులు నష్టపోతారు. ఆ కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే నిర్మాతలు, దర్శకులు, అగ్రహీరోలు కూడా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకుని చిత్రాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తే ఈ గొడవంతా ఉండదు. అప్పుడు అందరూ బిగ్ స్క్రీన్ లోనే చూడాలనుకుంటారు. సినిమా ఇప్పుడూ.. ఎప్పుడూ వినోదంగానే చూడాలి. వ్యాపారంగా మారితే అది అందరికీ ప్రమాదం. ఇది టాలీవుడ్ పెద్దలు కూడా ఆలోచించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఇమ్మడి రవిని సమర్థించే వారిని పక్కన పెట్టి తాము చిత్ర పరిశ్రమ నిలదొక్కుకోవడానికి ఏం చేయాలన్నది ఆలోచిస్తే మంచిదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News