విశాల్ సంచలన ఆరోపణలపై కేంద్రం సీరియస్

లంచం ఇచ్చానంటూ సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం

Update: 2023-09-29 09:42 GMT

లంచం ఇచ్చానంటూ సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. విశాల్ చేసిన ఆరోపణలపై విచారణ జరపనున్నట్లు తెలిపింది. సెన్సార్ బోర్డ్‌లో అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు రావడం బాధాకరమని, అవినీతి జరిగితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేసింది. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి విశాల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరపనున్నారు.

విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవ్వగా.. హిందీ వెర్షన్ సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. మార్క్ ఆంటోని చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎస్‌జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్, రీతూ వర్మ కీలక పాత్రల్లో కనిపించారు. మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ సెన్సార్ సర్టిఫికెట్ కు రూ.3.5 లక్షలు, సినిమా ప్రదర్శించుకునేందుకు మరో రూ.3 లక్షలు ఇచ్చానని తెలిపారు విశాల్. రెండు ట్రాన్సాక్షన్లలో చెల్లించానన్నారు విశాల్. నా కెరీర్ లో ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు. సినిమా రిలీజ్ కాకపోతే నష్టపోతామన్న తప్పనిసరి పరిస్థితుల్లో, మరో మార్గం లేక ఈ పని చేశానని అన్నారు. మేనకా అనే మధ్యవర్తి ద్వారా డబ్బు చెల్లించాల్సి వచ్చిందని.. భవిష్యత్తులో ఇతర నిర్మాతలకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదనే ఈ విషయాలను బయటపెడుతున్నానని అన్నారు విశాల్. చెల్లింపులు జరిపాం అనడానికి పక్కా ఆధారాలున్నాయని.. ఎం.రాజన్, జీజా రామ్ దాస్ అనే వ్యక్తులకు నగదు చెల్లించినట్టు బ్యాంకు ఖాతాల వివరాలను కూడా విశాల్ పంచుకున్నారు. విశాల్ అప్లోడ్ చేసిన వీడియోకు ప్రధాని నరేంద్ర మోదీని, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను ట్యాగ్ చేశారు.


Tags:    

Similar News