బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో ఎదురు లేని కథానాయికగా వెలుగొందిన బాలీవుడ్ హీరోయిన్లలో మొట్ట మొదటిగా గుర్తు వచ్చే పేరు రేఖ. 1966 లో తెలుగు చిత్రం రంగుల రాట్నం లో బాల నటిగా పరిచయం అయిన భాను రేఖ తరువాతి కాలంలో బాలీవుడ్ అగ్ర తార రేఖ గా ఎదిగింది. అలనాటి అభినయ ప్రదర్శకురాలు సావిత్రి భర్త శివాజీ గణేశన్ రెండవ భార్య కుమార్తే రేఖ. ప్రస్తుతం రాజ్య సభ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రేఖ. మరో సీనియర్ నటి, ఎం.పి అయిన హేమ మాలిని తరహాలోనే రేఖ కూడా తెలుగు చిత్రాలతో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు.
నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణిలో గౌతమీ గా కనిపించబోతున్న హేమ మాలిని కూడా 1968 లో పాండవ వనవాసం చిత్రంతో నృత్య కారిణిగా పరిచయం అయ్యారు. 2017 సంక్రాంతికి హేమ మాలిని కీలక పాత్ర పోషించిన గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదల అవుతుంది. మరో పక్క రేఖ తన కం బ్యాక్ చిత్రాన్ని ఒప్పుకోవటం జరిగిపోయింది. జయమ్ము నిశ్చయమ్మురా తో విజయాన్ని అందుకున్న కథానాయిక పూర్ణ తదుపరి తెలుగు చిత్రంలో, ఆవిడకి తల్లిగా రేఖ చేయనున్నారు. ఈ చిత్రం కూడా 2017 లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇద్దరు సీనియర్ నటులు 60 ల దశకంలో తెలుగు చిత్రాల ద్వారా పరిచయమై బాలీవుడ్లో అగ్ర స్థానాలు కైవసం చేసుకుని ఇద్దరు ఎం.పి లుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వారి కం బ్యాక్ చిత్రాలని కూడా తెలుగులో పైగా ఒకే ఏడాది విడుదల ప్లాన్ చేసుకోవటం యాదృచ్చికం.