Iran - Israel War : మధ్యప్రాచ్యానికి అమెరికా క్షిపణుల మళ్లింపు...నాటో భద్రతపై ఆందోళన

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం 22 రోజులవుతుంది

Update: 2026-03-21 02:12 GMT

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం 22 రోజులవుతుంది. ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా తన రక్షణ వనరులను మధ్యప్రాచ్యానికి మళ్లిస్తోంది. ఈ నేపథ్యంలో యూరప్‌లో రక్షణ వ్యవస్థల్లో లోటు ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం నాల్గో వారంలోకి అడుగుపెట్టగా, అమెరికా వేలాది సైనికులను ఆ ప్రాంతానికి పంపింది. అదనంగా 200 బిలియన్ డాలర్ల నిధులు కోరింది. ఇదే సమయంలో ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తోంది. అమెరికా స్థావరాలు, పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లపై కూడా దాడులు జరిగాయి. యుద్ధం ప్రారంభం తర్వాత ఇరాన్ నుంచి టర్కీ వైపు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంతో, జర్మనీ నుంచి రెండు పేట్రియట్ క్షిపణి వ్యవస్థలను టర్కీకి పంపారు. యూరప్‌లోని పలు ప్రాంతాల నుంచి కూడా పేట్రియట్ క్షిపణులను మధ్యప్రాచ్యానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

యూరప్ లో తగ్గుతున్న...
ఒక అధికారి మాట్లాడుతూ, “పేట్రియట్ క్షిపణుల నిల్వలు యూరప్‌లో తగ్గుతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది” అని చెప్పారు. అయితే వైట్ హౌస్ ప్రతినిధి కారొలైన్ లీవిట్ స్పందిస్తూ, “ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ లక్ష్యాలు సాధించడానికి అమెరికా వద్ద సరిపడా ఆయుధ నిల్వలు ఉన్నాయి” అని తెలిపారు. మరో అధికారి మాత్రం నాటో వద్ద యూరప్‌ను రక్షించే సామర్థ్యం ఇంకా ఉందని స్పష్టం చేశారు. పేట్రియట్ వ్యవస్థ భూమి నుంచి గాల్లో లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ. 1980లలో మొదట ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, తక్కువ దూర బాలిస్టిక్ క్షిపణులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా కింజాల్ వంటి హైపర్సోనిక్ క్షిపణులను కూడా ఇది సమర్థంగా ఎదుర్కొన్నట్లు అధికారులు తెలిపారు.
రష్యా ప్రమాదం మధ్య యూరప్‌కు ముప్పు
అయితే మధ్యప్రాచ్యంలో మాత్రం తక్కువ ఖర్చుతో తయారయ్యే ఇరాన్ ‘షాహెద్’ డ్రోన్లపై కూడా ఈ పేట్రియట్ వ్యవస్థను వినియోగిస్తున్నారని, దీనిపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేట్రియట్ వంటి వ్యవస్థలు ముఖ్యమైన సైనిక స్థావరాలను రక్షించడానికి ఉపయోగించాలనే అభిప్రాయం వెల్లడించారు. ఈ మార్పులు జరుగుతున్న సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. బాల్టిక్ దేశాలు, పోలాండ్, రొమేనియా ప్రాంతాల్లో రష్యా డ్రోన్లు చొరబడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. యూరప్‌పై రష్యా సైబర్ దాడులు, విధ్వంస చర్యలు కూడా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. “యూరప్ నుంచి ఏ సామర్థ్యాన్ని తీసినా, అది రష్యా పరిస్థితుల్లో స్పందించలేని పరిస్థితి తెస్తుంది” అని ఒక అధికారి హెచ్చరించారు.
నాటో దక్షిణ సరిహద్దులో రక్షణ బలపరచడం
ఫిబ్రవరి 28న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత, టర్కీ గగనతలంలోకి వచ్చిన మూడు బాలిస్టిక్ క్షిపణులను నాటో అడ్డుకున్నట్లు టర్కీ తెలిపింది. జర్మనీలోని రామ్‌స్టైన్ స్థావరం నుంచి టర్కీ ఇన్సిర్లిక్ ఎయిర్‌బేస్‌కు పేట్రియట్ వ్యవస్థను తరలించారు. తదుపరి మలత్యా ప్రావిన్స్‌లో మరో పేట్రియట్ వ్యవస్థను కూడా మోహరించారు. యూరప్ నుంచి కొన్ని గాలి రక్షణ సామర్థ్యాలను మధ్యప్రాచ్యానికి మళ్లించినట్లు నాటో అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్స్కీ పేట్రియట్ క్షిపణుల కొరత తప్పదని హెచ్చరించారు. అమెరికా నెలకు 60-65 క్షిపణులు తయారు చేస్తోందని, యుద్ధ తొలి రోజే వందల సంఖ్యలో వినియోగించినట్లు తెలిపారు.
డ్రోన్‌కు డ్రోన్‌తో ఎదురుదాడి
మధ్యప్రాచ్యంలో డ్రోన్ల ముప్పు పెరగడంతో ‘మెరోప్స్’ అనే యాంటీ-డ్రోన్ వ్యవస్థను అమెరికా ప్రవేశపెడుతోంది. పికప్ వాహనాల్లో అమర్చగలిగే ఈ వ్యవస్థ, తక్కువ ఖర్చుతో డ్రోన్లను కూల్చగలదు.ఇరాన్ షాహెద్ డ్రోన్లను ఎదుర్కోవడంలో అమెరికా స్పందన తగినంతగా లేదని అధికారులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొంత పరిమిత స్థాయిలో మెరోప్స్ వ్యవస్థలను మోహరించినట్లు తెలిపారు.


Tags:    

Similar News