Amercia - Iran War : మధ్యప్రాచ్యంలో యుద్ధంపై అమెరికా సందిగ్దత

మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలను తగ్గించే ఆలోచనలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు

Update: 2026-03-21 07:44 GMT

Iranians follow a truck carrying the coffins of Iran's intelligence minister Esmail Khatib and, according to Iranian officials, his wife and daughter, during a funeral procession in Tehran, Iran

మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలను తగ్గించే ఆలోచనలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇదే సమయంలో అమెరికా మూడు అదనపు అంబిఫిబియస్‌ దాడి నౌకలు, దాదాపు 2,500 మంది మెరైన్లను ఆ ప్రాంతానికి పంపిస్తోంది.శుక్రవారం సోషల్‌ మీడియాలో ట్రంప్ చేసిన పోస్టుకు ముందు, ప్రపంచవ్యాప్తంగా వినోద, పర్యాటక ప్రాంతాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో వైమానిక దాడులు, డ్రోన్‌, క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.చమురు ధరలు పెరగడంతో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ కుదేలైంది. దీనికి తోడు ఇప్పటికే నౌకల్లో లోడ్‌ చేసిన ఇరాన్ చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించడమే లక్ష్యమని తెలిపింది.

మూడు వారాల నుంచి...
మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు. శనివారం ఉదయం ఇరాన్ మళ్లీ క్షిపణి దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అదే సమయంలో సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలో కొద్ది గంటల్లోనే 20 డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. పెర్షియన్‌ నూతన సంవత్సర వేడుకలైన నవరూజ్ సందర్భంగా తెహ్రాన్‌లో ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. సాధారణంగా ఉత్సాహంగా జరిగే ఈ పండుగపై యుద్ధం ప్రభావం చూపింది. “మధ్యప్రాచ్యంలో మా సైనిక చర్యలను తగ్గించే దిశగా ఆలోచిస్తున్నప్పటికీ, మా లక్ష్యాలకు చాలా దగ్గరగా వచ్చేశాం” అని ట్రంప్ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు, అదే సమయంలో మరిన్ని సైనిక బలగాలను పంపించడం పరస్పర విరుద్ధంగా కనిపిస్తోంది. యుద్ధ ఖర్చుల కోసం కాంగ్రెస్ నుంచి మరో 200 బిలియన్‌ డాలర్లు కోరినట్లు సమాచారం.
మధ్యప్రాచ్యం బయట దాడుల హెచ్చరిక...
ఇప్పటికే ఆ ప్రాంతంలో 50 వేలకుపైగా అమెరికా సైనికులు ఉన్నారు. తాజాగా పంపిస్తున్న మెరైన్లు వారికి తోడవుతారు. ఇరాన్‌లో భూసేనలను పంపే ఆలోచన లేదని ట్రంప్ చెప్పారు. అయితే అన్ని అవకాశాలు తన ముందున్నాయని కూడా పేర్కొన్నారు. ఇరాన్ సైనిక ప్రతినిధి జనరల్ అబోల్ఫజల్ షేకార్చి ప్రపంచవ్యాప్తంగా పార్కులు, పర్యాటక ప్రదేశాలు సురక్షితం కావని హెచ్చరించారు. ఇది మళ్లీ ఉగ్రదాడుల భయం పెంచుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమెనీ నవరూజ్ సందర్భంగా దేశ ప్రజల ధైర్యాన్ని ప్రశంసించారు. అయితే ఆయన ప్రజల్లో ప్రత్యక్షంగా కనిపించడం లేదు.
లెబనాన్‌లో హిజ్బొల్లాపై దాడులు కొనసాగింపు...
శనివారం ఉదయం బీరూట్ దక్షిణ ప్రాంతాల్లో హిజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ భారీ దాడులు ప్రారంభించింది. పలుచోట్ల పొగలు ఎగిసిపడగా, పేలుళ్లు వినిపించాయి. లెబనాన్‌లో ఈ దాడుల్లో వెయ్యికి పైగా మంది మరణించగా, 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారని అక్కడి ప్రభుత్వం తెలిపింది.ఇరాన్‌లో యుద్ధంలో 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 15 మంది, వెస్ట్ బ్యాంక్‌లో మరో నలుగురు మరణించారు. అమెరికా సైన్యంలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు.బ్రెంట్ క్రూడ్‌ చమురు ధరలు యుద్ధంతో భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లు ఉండగా, ప్రస్తుతం 106 డాలర్ల వద్ద ఉన్నాయి.శుక్రవారం వరకు నౌకల్లో లోడ్ చేసిన ఇరాన్ చమురుపై ఆంక్షలు తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 19 వరకు అమల్లో ఉంటుంది.అయితే ఉత్పత్తి పెరగకపోవడంతో ధరలు తగ్గే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.



Tags:    

Similar News