TAL : లండన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు... తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈవెంట్

యునైటెడ్ కింగ్ డమ్ లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది.

Update: 2023-12-18 07:53 GMT

telugu association of london

యునైటెడ్ కింగ్ డమ్ లోని తెలుగు సంఘం ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. యూకేలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఈస్ట్‌హోమ్ లోని పిల్ గ్రిమ్స్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. క్రిస్మస్ సందర్భంగా ఈ సంస్థ ఏటా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అక్కడ ఉంటున్న తెలుగు వారిని ఒకచోటకు చేరుస్తుంది. ఈ యూనియన్ లోని 300 మంది సభ్యులకు అనేక పోటీలను నిర్వహించడంతో పాటు ఆటపాటలతో ఉల్లాసాన్ని కలిగించేలా కార్యక్రమాలను రూపొందించింది.

ఐక్యతను పెంపొందించేందుకు...
ఐక్యతాభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఛైర్‌పర్సన్ సబ్బా రవి అభిప్రాయపడ్డారు. తెలుగు సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఆయన అన్నారు. గత కొన్నేళ్లుగా ఈ సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు వాళ్లను ఏకం చేస్తుంది. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెతెల్మినిస్ట్రీస్, ఈస్ట్ హోమ్ బాప్టిస్ట్, ది లైట్ హౌస్ ఫెలోషిప్, మనోర్ పారక్, విజన్ మినిస్ట్రీస్, ప్రైస్ హార్వెస్ట్ చర్చిలలో ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

పిల్లలంతా వేడుకల్లో...
ఈ వేడుకల్లో వందల సంఖ్యలో తెలుగు వారు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రత్యేకంగా క్రిస్మస్ గీతాలతో పాటు ఏసుక్రీస్తు పుట్టి.. ఎదిగిన తీరును సవివరంగా తెలియజేసే చిత్రాలను ప్రదర్శించారు. పిల్లలంతా శాంతాక్లాజా దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడటంతో మరింత నిండుదనంతో పాటు కలర్ ఫుల్లుగా కనిపించింది. రెవరెండ్ సలోమి సుఖేష్ ఈ సందర్భంగా చేసిన ప్రసంగం హైలెట్ గా నిలిచింది. దేవుని ప్రేమను పంచుకోవడంతో పాటు ఈ క్రిస్మస్ పండగ నిజమైన అర్థాన్ని ఆయన వివరించారు.

ప్రత్యేక ప్రార్థనలు...
క్రిస్మస్ పండగ ప్రాముఖ్యాన్ని పాస్టర్ డేనియల్ తెలపడమే కాకుండా ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపారు. ప్రవీణ్ మణికొండ క్రిస్మస్ పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు తెలుగు వారంతా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు రవి మోచెర్ల, జెమిమా దారా, రత్నాకర్ దారా బృందానికి అందరూ అభినందనలు తెలియజేశారు. చివరిగా అనిల్ అనంతుల మాట్లాడుతూ ప్రతి ఏడా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ నిర్వహించే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో అందరూ చురుగ్గా పాల్గొనాలని కోరారు. తెలుగు అసోసియేషన్ త్వరలో జరపబోయే ఈవెంట్ల సమాచారం కోసం www.taluk.org వెబ్‌సైట్ లో చూడవచ్చని నిర్వాహకులు కోరారు.
Tags:    

Similar News