Operation Sindoor : నిజాలు చెబితే పాక్ కాలినట్లుందిగా.. మోదీ వాస్తవాలే చెప్పారుగా?
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల పాకిస్తాన్ గుర్రుగా ఉంది.
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల పాకిస్తాన్ గుర్రుగా ఉంది. మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపింది. మోదీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలోనే తాము కాల్పుల విరమణకు అంగీకరించామని పేర్కొంది. నిరాశ నిస్పృహలతో తాము కాల్పుల విరమణను కోరుకున్నది నిజం కాదని పాక్ తెలిపింది. మోదీ వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలుగా కనిపిస్తున్నాయని, అంతర్జీతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
మోదీ వ్యాఖ్యల్లో తప్పేముంది?
అయితే మోదీ వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రతి భారతీయుడు అడుగుతున్న ప్రశ్న. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడిన మాట నిజం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో భారత పౌరులపై దాడి చేయడం ఎంత వరకూ సబబు అంటూ ప్రశ్నిస్తున్నారు. భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే పాక్ పౌరులు, నివాసాలు, ఆలయాలు, పాఠశాలు, ప్రార్థనామందిరాలపై దాడులకు దిగడాన్ని కూడా అభ్యంతరకరమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాక్ లో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరికీ తెలుసునని, ఆర్థిక పరిస్థితి బాగా లేని సమయంలో అమెరికాను అర్థించి మరీ కాల్పుల విరమణకు ప్రయత్నించడం నిజం కాదా? అన్న ప్రశ్నలు తలెత్తుతుతున్నాయి.
అదే అసలు బాధ...
పాక్ - భారత్ మధ్య చర్చలలో కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశం చర్చించాలని భారత్ పట్టుబట్టడంలో తప్పేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాశ్మీర్ అంశంలో మరొక మధ్యవర్తిత్వాన్ని భారత్ అనుమతించబోదని చెప్పి మోదీ నిజమే చెప్పారని అంటున్నారు. కానీ పాక్ కు మాత్రం నిజాలు చెబితే కాలినట్లుంది. తమ దైన్య స్థితిని పాక్ ప్రజలతో పాటు ప్రపంచం ముందు మోదీ ఆవిష్కరించారన్న కసి దాయాది దేశంలో కనపడుతున్నట్లుందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మొత్తం మీద పాక్ ఇటు కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామంటూనే నరేంద్ర మోదీ వ్యాఖ్యలు పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు బిల్డప్ లు మాత్రం తమ దేశ పౌరుల ముందు ఇస్తుందని చెబుతున్నారు.