Nepal Agitation : నేపాల్ ను చూపి ప్రపంచం మొత్తం ఏం నేర్చుకోవాలంటే?

మొన్న శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్ ఇలా భారత్ సరిహద్దు దేశాలన్నీ దాదాపు అనిశ్చితి స్థితికి చేరుకున్నాయి.

Update: 2025-09-12 04:18 GMT

మొన్న శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్ ఇలా భారత్ సరిహద్దు దేశాలన్నీ దాదాపు అనిశ్చితి స్థితికి చేరుకున్నాయి. ఆర్థిక పరిస్థితులు, సోషల్ మీడియాపై నిషేధం వంటి కారణాలతో అక్కడ ప్రజలు తిరగబడ్డారు. ఈ మూడు దేశాల నుంచి ప్రపంచ దేశాలు అనేకం నేర్చుకోవాల్సి ఉంది. కేవలం ఎన్నుకున్న పాలకులు తీసుకునే నిర్ణయాలు స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజాప్రయోజనాల కోసం ఉండేలా చూడాలని ఈ మూడు దేశాల్లో జరిగిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రధానులను, మంత్రులను కూడా తరిమేసే శక్తి ప్రజలకు ఉందన్న విషయం ఈ మూడు దేశాలు ప్రపంచానికి చాటి చెప్పాయి.

రెండు రోజుల పాటు...
నేపాల్ రెండు రోజులు ఆందోళనలతో అట్టుడికిపోయింది. జెన్ జి పేరుతో వెల్లువెత్తిన ఆందోళనలను సైన్యం కూడా అడ్డుకట్ట వేయలేకపోయింది. చివరకు ఆందోళనకారుల డిమాండ్ కు తలొగ్గాల్సి వచ్చింది. ప్రపంచం మొత్తం ఈ ఆందోళనలతో ఉలిక్కిపడేలా చేరింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలపై నిషేధం విధించడంతో యువత ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయింది. ప్రభుత్వంలోని అందరూ రాజీనామా చేయాల్సి వచ్చింది. చివరకు ఆందోళనకారుల సూచనలతో కొత్త నేతను ఎన్నుకునేలా ఏర్పాట్లు చేస్తుంది. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కీని నేపాల్ కేర్ టేకర్ ప్రభుత్వ అధిపతిగా నియమించే అవకాశముందని అంటున్నారు. ఈ కేర్ టేకర్ ప్రబుత్వం నేపాల్ లో ఎన్నికలను నిర్వహించే అవకాశముంది. ఇదే ఆందోళనలు అరికట్టడానికి ప్రధాన పరిష్కారం అని భావిస్తున్నారు.
అర్ధరాత్రి వరకూ చర్చలు...
నిన్న అర్ధరాత్రి వరకూ చర్చలు జరిగాయి. జెన్ జీ గ్రూపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకు నేతృత్వం వహించిన వారితో సైనికాధ్యక్షుడు చర్చలు జరిపారు. అందుతున్న సమాచారం మేరకు కార్కిని నేపాల్ తొలి మహిళ ప్రధానిగా నియమించే అవకాశముందని తెలిసింది. ఇందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటును రద్దు చేయడంంతో పాటు కొనసాగించడంపైనే కూడా రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తారు. ఆందోళనకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే పాలకులందరూ రాజీనామా చేయడంతో నేపాల్ లో రాజ్యంగా సంక్షోభం నెలకొంది. దీనిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
నేటి నుంచి కర్ఫ్యూ సడలింపు...
అయితే నిన్నటి వరకూ నేపాల్ లో కర్ఫ్యూ కొనసాగింది. అయితే ఆందోళనలు చర్చల నేపథ్యంలో కొంత వరకూ సద్దుమణగడంతో నేడు కర్ఫ్యూను సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకూ కర్ఫ్యూ సడలిస్తారు. ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తిరిగి ఆంక్షలు కొనసాగుతాయి. తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడుగంటల వరకు రెండు గంటల విరామం ఇచ్చిన తర్వాత రాత్రి 7 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ కర్ఫ్యూ ను సడలించిన సమయంలోనే ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మరొకవైపు నేపాల్ లో చిక్కుకుపోయిన ఇతర దేశాల ప్రజలను ఆ యా దేశాలు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి తీసుకెళ్లపోతున్నాయి. ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 34 కు చేరింది.


Tags:    

Similar News