Gaja Israil Ceasefire : తిరుగు ప్రయాణంలో పాలస్తీనీయులు - గాజాలో నెలకొన్న ప్రశాంతత
కాల్పుల విరమణ ఒప్పందం గాజా - ఇజ్రాయిల్ మధ్య అమలులోకి వచ్చింది
కాల్పుల విరమణ ఒప్పందం గాజా - ఇజ్రాయిల్ మధ్య అమలులోకి వచ్చింది. అమెరికా సమన్వయంతో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య తాజా కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం అమల్లోకి వచ్చింది. దీంతో, రెండు సంవత్సరాలుగా సాగుతున్న ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి ముగింపు దిశగా అడుగు పడినట్టు భావిస్తున్నారు. ఈ విరమణ నేపథ్యంలో, వేలాది పాలస్తీనీయులు గాజా ఉత్తర ప్రాంతానికి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. సైన్యం ప్రకటన అనంతరం గాజాలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం వరకు కొనసాగిన భారీ షెలింగ్ ఆగిపోయింది. మిగిలిన నలభై మంది మంది బందీలలో సుమారు 20 మంది ప్రాణాలతో ఉన్నారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వీరిని సోమవారం లోపు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
రెండేళ్ల క్రితం ప్రారంభమైన...
ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు జాతిని ఉద్దేశించి ప్రసంగిసతూ హమాస్ నిరాయుధీకరణ సులభ మార్గంలో జరగకపోతే, కఠిన మార్గంలో అయినా పూర్తవుతుందని హెచ్చరించారు. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతరం ఈ యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి దాదాపు అరవై ఏడు వేల మందికి పైగా పాలస్తీనీయులు మరణించగా, లక్షలాది మంది గాయపడ్డారు. గాజా ప్రాంతంలోని రెండు మిలియన్ల జనాభాలో 90 శాతం మంది అనేకసార్లు తాము తలదాచుకునే ప్రాంతాలను మార్చుకున్నారు. చాలామంది తిరిగి వెళ్తున్న తమ ఇళ్ల స్థానంలో ఇప్పుడు మిగిలింది కేవలం ధ్వంసమైన శిథిలాలేనని చెబుతున్నారు. తిరిగి తమ ఇళ్లను పున్నర్నించుకోవాల్సి ఉంటుందని ఆవేదన చెందుతున్నారు.
ఖైదీల విడుదల విషయంలో...
ఇజ్రాయెల్ అనుమతితో ఐక్యరాజ్యసమితి ఆదివారం నుంచి గాజాకు భారీ స్థాయిలో సహాయక సరుకులను తరలించనుంది. ఇప్పటికే జోర్డాన్, ఈజిప్ట్ దేశాల్లో సిద్ధంగా ఉన్న 1.7 లక్షల టన్నుల సరుకులను గాజాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంధనం, ఔషధాలు, ఆహార పదార్థాలు సరిహద్దు మార్గం ద్వారా పంపించేందుకు ఐక్యరాజ్యసమితి అన్ని ఏర్పాట్లు చేసింది. గత కొన్ని నెలలుగా గాజాకు అవసరమైన సహాయం కేవలం 20 శాతం మాత్రమే చేరిందని ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు. కుదిరిన ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ సుమారు రెండు వేల పాలస్తీనీ ఖైదీలను విడుదల చేస్తోంది. వీరి జాబితాలో ప్రముఖ నేత మార్వాన్ బర్గూతీ లేరు. హమాస్ ప్రతినిధి ఖలీల్ అల్–హయ్యా ప్రకారం, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న మహిళలు, పిల్లలు ముందుగా విడుదల అవుతారని చెప్పారు. యుద్ధంలో మృతదేహాలు కూడా స్వదేశానికి తిరిగి ఇవ్వాలన్న ఆశతో ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
చాలా రోజుల తర్వాత...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన దాని ప్రకారం, ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో సైనిక ఉనికిని కొనసాగించనుంది. అంతర్జాతీయ దళాలు — ముఖ్యంగా అరబ్, ముస్లిం దేశాల సైనికులు గాజాలో భద్రతను నిర్వహిస్తారు. ఆర్థిక పునర్నిర్మాణానికి అమెరికా నేతృత్వంలో భారీ అంతర్జాతీయ నిధులు సమకూరనున్నాయి. కానీ, గాజా పాలన భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం, హమాస్ పూర్తిగా ఆయుధాలను వదిలేస్తుందా లేదా అన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. మూడు రోజుల్లో మిగిలిన బందీల విడుదలవుతారంటున్నారు. హమాస్ నిరాయుధీకరణపై అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. మొత్తం మీద గాజాలో చాలా రోజుల తర్వాత శాంతి యుత పరిస్థితులు నెలకొన్నాయి.