Mexico : మెక్సికో డ్రగ్ మాఫియా నేత ఎల్ మెంచో ఎన్‌కౌంటర్.. చెలరేగిన హింస..70 మంది మృతి
మెక్సికోలో డ్రగ్స్ మాఫియా నేత నెమెసియో ఒసెగువేరా సెర్వంటెస్ అలియాస్ ఎల్ మెంచో ఎన్ కౌంటర్ తో హింస చెలరేగింది.
మెక్సికోలో డ్రగ్స్ మాఫియా నేత నెమెసియో ఒసెగువేరా సెర్వంటెస్ అలియాస్ ఎల్ మెంచోను భద్రతా బలగాలు హతమార్చిన ఒక రోజు తర్వాత మెక్సికోలో హింస చెలరేగింది. అతడి అనుచరులు విధ్వంసానికి దిగారు. అతడి సొంత రాష్ట్రమైన హలిస్కోలని తపాల్పాలో మెక్సికో సైన్యం జరిపిన ఆపరేషన్ చేపట్టి సోదాలను నిర్వహించింది. ఎల్ మెంచో అనుచరులు కాల్పులను ప్రారంభించడంతో సైన్యం తిరిగి కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఎల్ మెంచ్ గాయపడ్డాడు. అతనినిమెక్సికోకు తరలించేలోపు మరణించాడు. దీంతో అతని అనుచరులు విధ్వంసానికి దిగారు. ఒకవైపు పర్యాటక దుకాణాలు సోమవారం తెరుచుకున్నాయి. ఉద్యోగులు పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు కాల్పులు వినిపించాయి. బుల్లెట్లతో దెబ్బతిన్న వాహనం పక్కనే ఓ వ్యక్తి మృతదేహం రోడ్డుపై కనిపించింది.
20 రాష్ట్రాల్లో 250కిపైగా రహదారులను...
ఎల్ మెంచోను పట్టుకునే ప్రయత్నంలో దాదాపు డెబ్భయి మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అతను “ఎల్ మెంచో”గా ప్రఖ్యాతి గాంచాడు. జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్‌కు నేతగా ఉన్నాడు. ఈ కార్టెల్ మెక్సికోలో శక్తివంతమైన నేరగాళ్ల గుంపుల్లో ఒకటి. ఎల్ మెంచో మృతితో కార్టెల్ విస్తృత హింసకు దిగింది. 20 రాష్ట్రాల్లో 250కిపైగా రహదారి బ్లాకులు ఏర్పాటు చేసింది. వాహనాలకు నిప్పంటించింది. పట్టణ శివార్లలో పొగలు ఎగసిపడ్డాయి. రహదారులను మూసివేయడంతో రవాణా స్థంభించింది. మెక్సికో రక్షణ శాఖ కార్యదర్శి జనరల్ రికార్డో ట్రెవిల్లా సోమవారం మాట్లాడుతూ, సర్వాంటెస్ సహచరురాలి కదలికల ఆధారంగా అతని గూడు గుర్తించినట్లు తెలిపారు. భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో అతను, అతని ఇద్దరు గన్‌మ్యాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న తర్వాత మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు చెప్పారు.
సైనికుడిని చంపితే వెయ్యి డాలర్లు...
జలిస్కోలో మరో ప్రాంతంలో ఉన్న కార్టెల్ ఉన్నత స్థాయి సభ్యుడిని సైన్యం కాల్చిచంపింది. అతడు సైనికులపై దాడులను సమన్వయం చేస్తున్నాడని ట్రెవిల్లా తెలిపారు. ప్రతి సైనికుడిని హతమార్చితే వెయ్యి డాలర్లు ఇస్తానని ప్రలోభాలకు గురి చేసినట్లు పేర్కొన్నారు. ఆరుచోట్ల జరిగిన వేర్వేరు దాడుల్లో 25 మంది నేషనల్ గార్డ్ సిబ్బంది మృతి చెందినట్లు భద్రతా శాఖ మంత్రి ఒమర్ గార్సియా హార్ఫూచ్ తెలిపారు. జలిస్కోలో 30 మంది నిందితులు, పొరుగున ఉన్న మిచోకాన్ రాష్ట్రంలో నలుగురు హతమయ్యారని చెప్పారు. జైలు గార్డు, రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చెందిన ఏజెంట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్‌కు అమెరికా గూఢచారి సమాచారం అందించినట్లు వైట్ హౌస్ ధృవీకరించింది. రెండు దేశాల్లో అత్యంత వాంఛనీయ నేరగాడిని హతమార్చినందుకు మెక్సికో సైన్యాన్ని ప్రశంసించింది.
అమెరికా మద్దతుతో.. ట్రంప్ ఒత్తిడి కారణంగా...
ఫెంటానిల్ అక్రమ రవాణాను అరికట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికోపై ఒత్తిడి తెచ్చారు. అవసరమైతే సుంకాలు పెంచుతామని, ఏకపక్ష సైనిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్ మెంచో అరెస్టుకు దారితీసే సమాచారానికి అమెరికా విదేశాంగ శాఖ 1.5 కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించింది.2025 ఫిబ్రవరిలో ట్రంప్ ప్రభుత్వం జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. 2009లో ఈ కార్టెల్ కార్యకలాపాలు ప్రారంభించింది. సైన్యంపై హెలికాప్టర్లతో దాడులు చేయడం, డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు విసరడం వంటి చర్యలకు ఇది పేరుగాంచింది.
భయాందోళనలో స్థానికులు.. పర్యాటకులు...
మరింత హింస జరిగే ప్రమాదంతో పలు రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేశారు. స్థానిక ప్రభుత్వాలు తమ పౌరులు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించాయి. ఎనిమిది నగరాలు, మిచోకాన్ రాష్ట్రంలో ఉన్న తమ సిబ్బంది బయటకు రావొద్దని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. గ్వాదలహారాలో ఆదివారం దాదాపు నగరం మొత్తం మూసుకుపోయింది. సోమవారం పని దినం ప్రారంభమైనా రహదారులపై తక్కువ రాకపోకలు కనిపించాయి. జూలో చిక్కుకున్న వెయ్యిమందికిపైగా రాత్రంతా బస్సుల్లో గడిపారు. “ప్రజల భద్రత దృష్ట్యా జూలోనే ఉండేలా అనుమతించాం” అని డైరెక్టర్ లూయిస్ సోటో రెండోన్ తెలిపారు. ప్యూర్టో వల్లార్టాలో ఉన్న అమెరికన్ పర్యాటకుడు స్టీవ్ పెర్కిన్స్ మాట్లాడుతూ, ఉదయం పేలుళ్ల శబ్దాలు విన్నామని చెప్పారు. “చుట్టూ నల్ల పొగ మేఘాలు కనిపించాయి. కేకలు వినిపించాయి. మేము పరుగెత్తాల్సి వస్తే సిద్ధంగా ఉండేందుకు షూస్ వేసుకున్నాం” అని తెలిపారు. తన భార్య పిల్లలకు ఫోన్ చేసి వీడ్కోలు చెప్పిందని చెప్పారు.జోయెల్ రామిరెజ్ అనే యువకుడు రహదారి బ్లాక్ తొలగించేవరకు సైనికుల కోసం ఎదురుచూస్తున్నాడు. “ఇప్పుడంతా కాస్త ప్రశాంతంగా ఉంది. కానీ ఇంటికి చేరలేక ఇక్కడే చిక్కుకున్నాం. భయంగా ఉంది” అని అన్నాడు.ఇర్మా హెర్నాండెజ్ అనే హోటల్ భద్రతా సిబ్బంది రవాణా లేక ప్రైవేట్ కారులో పనికి వెళ్లింది. “ఏదైనా జరిగితే ఇంటికి ఎలా చేరతానో తెలియడం లేదు” అని ఆందోళన వ్యక్తం చేసింది.