హైదరాబాద్ లో నేటి నుండి ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

Update: 2022-08-31 08:16 GMT

హైదరాబాద్ లో నేటి నుండి ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యాయి. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు ఖైరతాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసేవరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. భక్తుల వాహనాల కోసం పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించారు. ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని ప్రతిష్టించారు. అన్ని విగ్రహాలను పూర్తిగా మట్టితో రూపొందించారు. ఈ భారీ విగ్రహం తయారీకి రూ.1.50 కోట్లు ఖర్చయినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్ వినాయకుడికి తొలిపూజ నిర్వహించారు. గవర్నర్ కు పురోహితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉదయం పద్మశాలి సంఘం తరపున 50 అడుగుల జంధ్యం, కండువా, గరికమాల, పట్టువస్త్రాలను స్వామి వారికి సమర్పించారు.


Tags:    

Similar News